భోళా శంకర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి పూర్తిగా మారిపోతున్నాడు. తనను తాను కొత్తగా చూపించుకోవాలని చూస్తున్నాడు. ఇకపై వయసుకు తగ్గ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలని డిసైడ్ అయినట్టు హింట్ ఇస్తున్నాడు. అయినా మన పిచ్చిగానీ.. చిరు డాన్సులని ఇప్పుడు కొత్తగా చూడాలా..? మెగాస్టార్‌లోని మాస్ యాంగిల్ మనకు తెలియనిదా..? అందుకే ఆయనేం చేసినా.. రొటీన్‌గానే అనిపిస్తుంది ఆడియన్స్‌కు. అందుకే ఇప్పుడు మెగాస్టార్ ఇంకాస్త మారిపోతున్నాడు. తోటి హీరోల దారిలోనే ఈయన కూడా వెళ్తానంటున్నారు. మాస్ సినిమాలతో పూనకాలు పుట్టించడం చిరంజీవికి కొత్తేం కాదు.
ఆయనలోని మాస్‌ను మరీ ఎక్కువ చూసినందుకేమో గానీ.. ఈ మధ్య చిరంజీవి ఎంచుకుంటున్న కథలు రొటీన్ అవుతున్నాయనే విమర్శలొస్తున్నాయి. మరోవైపు రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోలు జైలర్, విక్రమ్ అంటూ వయసుకు తగ్గ పాత్రలు చేస్తుంటే.. చిరు ఎందుకు చేయట్లేదనే ప్రశ్నలు కూడా రైజ్ అవుతున్నాయి. రజినీ, కమల్ వరకు ఎందుకు.. అఖండ తర్వాత బాలయ్య థింకింగ్ కూడా మారిపోయింది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్‌లోనూ ఏజ్డ్ రోల్ చేసాడు బాలయ్య. అఖండ 2 లైన్‌లో ఉంది.
ఇప్పుడు చిరంజీవి కూడా తోటి హీరోల్లా ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది. ప్రస్తుతం నటిస్తున్న విశ్వంభర విజువల్ ఎఫెక్ట్స్ బేస్డ్ సినిమా. అలాగే లైన్‌లో ఉన్న శ్రీకాంత్ ఓదెల సినిమాలో ఎక్కువగా మాస్ సంభవం ఉండబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్, పాటలు లాంటి రెగ్యులర్ కమర్షియల్ అంశాల కంటే ఎక్కువగా కథపై ఫోకస్ చేస్తున్నాడు ఓదెల.
కొత్తగా ప్రయత్నిస్తూనే.. తన స్ట్రెంత్ సినిమాలు కూడా వదలట్లేదు చిరంజీవి. అనిల్ రావిపూడితో త్వరలోనే అల్టిమేట్ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్నాడు. 2026 సంక్రాంతికి ఈ సినిమా విడుదల ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి చిరు లైనప్ మామూలుగా లేదిప్పుడు.