మంచు హీరో మనోజ్ ఇటీవలే రెండో వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రముఖ రాజకీయ దంపతులు దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి కూతురైన మౌనిక రెడ్డిని మంచు మనోజ్ ఇటీవలే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరికీ దాదాపు 12 ఏళ్ల పరిచయం ఉంది. అలాగే నాలుగేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. ఇటీవలే పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. తాజాగా ఈ జంట ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తమ పరిచయం, ప్రేమ, పెళ్ళికి సంబంధించిన విషయాలను తెలిపారు. అలాగే పెళ్ళికి ముందు పడిన కష్టాలను కూడా తెలిపారు మంచు మనోజ్, మౌనిక.
ఈ ఇంటర్వ్యూలో మంచు మనోజ్ మాట్లాడుతూ.. మా కుటుంబానికి, భూమా కుటుంబానికి దాదాపు 15 ఏళ్లుగా పరిచయం ఉంది అన్నారు. కానీ మేము వేరు వేరు దారుల్లో వెళ్ళాం.. ఆ తర్వాత నా కెరీర్‌లో చాలా ఇబ్బందులు పడ్డా అన్నారు. అలాగే తాను మౌనిక రెడ్డికి ఎలా ప్రపోజ్ చేశాడో కూడా వివరించాడు మనోజ్.
ముందుగా నాకే తన మీద లవ్ ఫీల్ కలిగింది. ఒక రోజు తనతో నువ్వంటే ఇష్టమని చెప్పాను. జీవితంలో చాలా బాధను చూశాను. నాకు మళ్లీ సంతోషంగా బతకాలనుంది. నాకు కొత్త జీవితం నీ వల్లే వస్తుంది. నా జీవితం ఇలా ఉండడం నాకు నచ్చడం లేదు. నువ్వు యాక్సెప్ట్ చేస్తే నాకు మంచి లైఫ్ దొరుకుతుంది అని చెప్పను. అయితే ఈ సమాజం ఏమనుకుంటుంది.? అని ఆలోచించావా అని నన్ను అడిగింది. నేను బాగా ఆలోచించాను అని చెప్పిన తర్వాత తాను ఒప్పుకుంది అని మనోజ్ తెలిపాడు.