Savitri: ఇది చివరి రోజుల్లో సావిత్రి పరిస్థితి.. సినిమాలో మీకు చూపించని విషయాలు

మహానటి సావిత్రి జీవిత చరమాంకం దుర్భరంగా గడిచింది. వివాహ వైఫల్యం, ఆర్థిక నష్టాల తర్వాత అనారోగ్యం పాలై, కోమాలోకి వెళ్లారు. 1980 మేలో బెంగళూరులో అస్వస్థతకు గురైన సావిత్రికి ఆసుపత్రిలో చోటు దొరకలేదు. చివరికి ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. 596 రోజులు కోమాలో ఉండి 1981 డిసెంబర్ 26న కన్నుమూశారు.

Savitri: ఇది చివరి రోజుల్లో సావిత్రి పరిస్థితి.. సినిమాలో మీకు చూపించని విషయాలు
Mahanati Savitri

Updated on: Jan 16, 2026 | 4:20 PM

తెలుగు సినిమా స్వర్ణయుగంలో మకుటంలేని మహారాణిగా వెలుగొందిన సావిత్రి జీవితం, ఆమె కెరీర్ ఎంత వైభవంగా సాగిందో, చివరి రోజులు అంత దుర్భరంగా గడిచాయి. పోషించిన ప్రతి పాత్రలో జీవించిన ఆమె, నిజ జీవితంలో మాత్రం అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మహారాణిలా వెలిగిన సావిత్రి, 45 ఏళ్లకే ఈ లోకం నుంచి విషాదంగా నిష్క్రమించారు. దాదాపు ఏడాదిన్నర పాటు విగతజీవిలా పడి ఉండి, చివరకు 1981 డిసెంబర్ 26న కన్నుమూశారు. ఆమె ఆస్తుల ప్రస్థానం తొలి రోజుల్లోనే ప్రారంభమైంది. మద్రాసులో తండ్రి చౌదరి సంరక్షణలో ఉన్నప్పుడు అద్దె ఇంట్లో నివసించిన సావిత్రి, 1958 మార్చి 1న టీ. నగర్, హబీబుల్లా రోడ్డులో తన మొదటి రెండంతస్తుల మేడను నిర్మించారు. ఆ తర్వాత నాలుగు ఇళ్లు, ఊటీలో ఒక బంగళాను కూడా సంపాదించారు. అక్కినేని నాగేశ్వరరావు తన సారంగపాణి వీధి ఇంటిని దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుకు అమ్మగా, దానిని సావిత్రి కొనుగోలు చేశారు. అయితే, జెమిని గణేషన్‌తో వివాహం విఫలమవడంతో ఆమె నిర్వేదంలో కూరుకుపోయి, మత్తును ఆశ్రయించి తన ఆస్తులన్నీ కోల్పోయారు. చివరి రోజులను అన్నా నగర్‌లోని ఒక చిన్న ఇంట్లో గడిపారు. 1980 మేలో ఒక కన్నడ చిత్రం షూటింగ్ కోసం సావిత్రి బెంగళూరు వెళ్లారు. మే 10న షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత హోటల్ గదికి చేరుకున్నారు. నిద్రించిన కొద్దిసేపటికే తీవ్రమైన అస్వస్థతకు లోనై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఉదయం ఆమె లేవకపోవడంతో హోటల్ సిబ్బంది అనుమానించి చూడగా, ఆమె స్పృహలో లేరు. నోటి నుంచి నురగ కారుతోంది. వెంటనే హోటల్ మేనేజర్ యూనిట్ సభ్యులకు సమాచారం అందించారు. వారు ఆమెను కారులో ఎక్కించుకుని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే, ఆసుపత్రి వర్గాలు ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించాయి. అంతకు ముందు రోజే మలయాళ నటి శుభ ఆత్మహత్యకు ప్రయత్నించి, ఆసుపత్రికి తీసుకురాగానే మరణించడం, ఆమె బంధువులు ఆసుపత్రిపై దాడి చేయడంతో వారు ఆ గొడవలో సావిత్రిని చేర్చుకోవడానికి భయపడ్డారు. మరో రెండు ఆసుపత్రులు కూడా ఇదే పరిస్థితి. చేసేదేమీ లేక శివాజీనగర్ బస్ స్టాండ్ సమీపంలోని బేరింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో సావిత్రిని చేర్చారు. మూడు రోజులపాటు డాక్టర్లు చికిత్స అందించినా ఆమె పరిస్థితిలో మార్పు రాలేదు. మానసిక వ్యాధి నిపుణులు డాక్టర్ శ్రీనివాసన్ ఆమెను పరీక్షించి, మానసికంగా ఆమె బాగానే ఉన్నారని చెప్పారు. అన్ని పరీక్షల తర్వాత సావిత్రి కోమాలోకి వెళ్లారని, మెదడు కణాలు చాలా వరకు చనిపోయాయని నిర్ధారించారు.

సావిత్రి అస్వస్థతకు గురయ్యారని తెలిసినప్పుడు జెమిని గణేషన్ మలేషియాలో ఉన్నారు. ఆయన తన మొదటి భార్య బాబ్జీని బెంగళూరు పంపించారు. మే 18న ఆయన కూడా బెంగళూరు చేరుకున్నారు. జెమిని గణేషన్ “నేను వచ్చాను, నీకు ఎలా ఉంది?” అని పలకరించగా, సావిత్రి కష్టంగా కళ్లు తెరిచి భర్తను చూసి కన్నీరు పెట్టుకున్నారు కానీ మాట్లాడలేకపోయారు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కూడా ఆసుపత్రికి వచ్చి సావిత్రిని పరామర్శించారు. మే 27 వరకు బెంగళూరులో చికిత్స పొందిన తర్వాత, అపస్మారక స్థితిలో ఉన్న సావిత్రిని మద్రాసుకు తరలించి లేడీ వెల్లింగ్టన్ ఆసుపత్రిలో చేర్చారు. మూడు నెలలపాటు అక్కడ చికిత్స పొందిన తర్వాత, ఆమె అన్నా నగర్‌లోని అద్దె ఇంటికి తీసుకువచ్చారు. రోజులు, వారాలు, నెలలు గడిచాయి. సావిత్రి మంచానికే పరిమితమై సంవత్సరం పైగా గడిచింది. అలా పడుకునే ఉండటం వల్ల ఆమె వీపు అంతా పుండ్లు పడ్డాయి. సినిమాల్లో ప్రతి పాత్రను సవాలుగా తీసుకుని నటించి నెగ్గిన మహానటి, చివరికి విధి రాతతో పోరాడుతోంది. సావిత్రి అపస్మారక స్థితి గురించి పత్రికల్లో వార్తలు చూసి విజయవాడలోని హోమియో వైద్యుడు డాక్టర్ వాసు కదిలిపోయారు. తన వైద్యంతో ఆమెను బాగుచేయగలనని నమ్మకంతో మద్రాసు చేరుకుని, కుటుంబ సభ్యుల అనుమతితో వైద్యం ప్రారంభించారు. సావిత్రి పరిస్థితి గురించి తెలుసుకున్న అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు వంటి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆమె కోలుకోవాలని తెలుగు, తమిళ ప్రేక్షకులు ప్రార్థనలు చేశారు. సావిత్రి వైద్యానికి అయిన ఖర్చులో చాలా భాగం అన్నా నగర్‌కు వచ్చిన తర్వాత సంపాదించుకున్న డబ్బు నుంచే భరించారు. అంతకుముందు ఆమె సంపాదించిన సంపద అంతా ఆదాయపు పన్ను అధికారులు జప్తు చేశారు. బ్యాంక్ ఖాతాలు కూడా జప్తు చేయబడ్డాయి. కోమాలోకి వెళ్ళిన 596వ రోజు, అంటే 1981 డిసెంబర్ 26 రాత్రి 10:30 గంటలకు మహానటి తుది శ్వాస విడిచారు. సావిత్రికి మరణం లేదు; ఆమె సినీ చరిత్రలో ఒక అజరామర జ్ఞాపకంగా నిలిచిపోయారు.

Also Read: అభిమానులను మోసం చేశావ్ ఉదయ్ కిరణ్.. ఫీనిక్స్ ఫక్షిలా లేచి వస్తానని చెప్పి..