ప్రముఖ సింగర్ వాణీజయరాం అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో వాణి జయరాంకు కడసారి కన్నీటి వీడ్కోలు పలికింది. బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వాణీ జయరాం నివాసానికి వచ్చారు. దిగ్గజ గాయని పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘వాణీజయరాంకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మభూషన్ అవార్డు ప్రకటించింది. దురదృష్టవశాత్తు ఆ పురస్కారం తీసుకోకుండానే ఆమె కన్నుమూశారు. వాణీజయరాం కుటుంబ సభ్యులకు, సినీ లోకానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’అని స్టాలిన్సంతాపం తెలిపారు. ఆ తర్వాత వాణి జయరాం అంతిమ యాత్ర నుంగంబాక్కంలోని హాడ్డోస్ లేన్‌లో ఉన్న ఆమె నివాసం నుంచి బీసెంట్ నగర్ శ్మశానవాటిక వరకు కొనసాగింది. దారిపొడవునా సినీ అభిమానులు అమెకు కన్నీటి వీడ్కోలు పలికారు.
కాగా పడక గదిలో కిందపడటం వల్లే వాణీ జయారం కన్నుమూశారని పోలీసులు చెబుతున్నారు. బెడ్రూంలో ఆమె కింద పడటంతో తలకు బలమైన గాయం తగలడం వల్లే ప్రాణం పోయిందని ఫోరెన్సిక్ నిపుణులు నివేదిక ఇచ్చారని పోలీసులు తెలిపారు. వాణి జయరాం ఇల్లు ఉండే అపార్టుమెంట్ సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించినప్పటికీ ఎక్కడా కూడా అనుమానాస్పద కదలికలు కనిపించలేదన్నారు. వాణి జయరాం మృతి చెందిన ఇంటిని చెన్నై , ట్రిప్లికేణి అసిస్టెంట్ కమిషనర్ దేశ్‌ముఖ్ శేఖర్ సంజయ్‌తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. అయితే, శవపరీక్ష నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..