Senior NTR: ఆ రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ అలవాట్లు ఎలా ఉండేవంటే..?

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితంలోని ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆయన దినచర్య, వ్యాయామం, భోజనపు అలవాట్లు, వ్యసనాలకు దూరం, భక్తి భావన, అంకితభావంతో కూడిన పనితీరు, అలాగే తన వారసులు సినీరంగంలో ఎలా కొనసాగుతున్నారో ఫుల్ డీటేల్స్ మీ కోసం ...

Senior NTR: ఆ రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ అలవాట్లు ఎలా ఉండేవంటే..?
Nandamuri Taraka Rama Rao

Updated on: Dec 31, 2025 | 8:47 AM

ఎదురులేని ఏలికగా తెలుగు చిత్ర పరిశ్రమను మూడు దశాబ్దాల పాటు రూల్ చేసిన దివంగత నందమూరి తారక రామారావు, తెలుగువారి హృదయాలలో ఇలవేల్పుగా స్థానం సంపాదించుకున్నారు. ఆయన జీవితం, దినచర్య, వ్యక్తిగత అలవాట్లు, పని పట్ల అంకితభావం, అలాగే వారసత్వం గురించి కొన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ బిజీగా ఉన్న రోజుల్లో, మద్రాసులోని త్యాగరాయ నగర్‌లో ఉన్న నందమూరి హౌస్‌లో అర్ధరాత్రి దాటిన గంటన్నర తర్వాత సందడి మొదలయ్యేది. తెల్లారి మూడు గంటలకే నిద్రలేచే ఎన్టీఆర్ ముందుగా ఓ గంట సేపు వ్యాయామం చేసేవారు. నటుడికి వ్యాయామం అత్యవసరం అని ఆయన తరచూ చెప్పేవారు. వ్యాయామం పూర్తయిన తర్వాత, శ్రీమతి బసవతారకంతో కలిసి పిల్లలను తీసుకుని బీచ్‌కు వెళ్లేవారు. అక్కడ పిల్లలతో తుమ్మెద పాటలు, జానపద గేయాలు పాడుతూ ఒక గంట సేపు ఆనందంగా గడిపేవారట వెటరన్ ఫిల్మ్ జర్మలిస్టులు వివరిస్తున్నారు. ఆర్టిస్ట్‌గా బిజీ అయిన తరువాత, రోజుకు రెండు షిఫ్ట్‌లు పని చేయాల్సి రావడంతో బీచ్‌కు వెళ్లడం మానుకున్నారట. ఉదయం ఐదు గంటలకల్లా స్నానాదులు ముగించుకుని, ఖద్దర్ సిల్క్ లాల్చీ, సిల్క్ ధోవతి ధరించి, నుదుట తిలకంతో సిద్ధమై, ఆఫీసులో తన కోసం ఎదురుచూస్తున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, మిత్రులను కలిసేవారు. అప్పటికే ఆయన ఆఫీసు కళకళలాడేది.

ఎన్టీఆర్ ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే, ఆయనకు చికెన్ అంటే చాలా ఇష్టమని ఆయనకు సన్నిహితంగా మెలిగినవారు చెబుతుంటారు. రోజుకు ఒక కోడిని అవలీలగా తినేవారని ఆయన అలవాట్లు తెలిసిన వారు వ్యాఖ్యానిస్తుంటారు. మిరపకాయ బజ్జీలు కూడా అన్నగారికి మహా ఇష్టమట. టీ అంటే కూడా ఆయనకు మక్కువ ఉండేది, రోజులో చాలా సార్లు టీ తాగేవారు. అయితే తల్లి మరణానంతరం టీ తాగడం మానేసి, దానికి బదులు పాలు లేదా మజ్జిగ తీసుకునేవారు. ఎన్టీఆర్ వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండేవారు. అయితే, చిత్రరంగ ప్రవేశం చేసిన తొలి రోజుల్లో, ఖంగుమనే కంఠ స్వరం కోసం ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి చుట్ట తాగేవారని వినికిడి. ఆ తరువాత కొన్ని రోజులు సిగరెట్ అలవాటు ఉన్నా, క్రమంగా దానిని కూడా మానుకున్నారు. మొదట్లో కిళ్లీలు వేసుకునే అలవాటు కూడా ఎన్టీఆర్‌కు ఉండేదట. అయితే, దర్శకుడు, నిర్మాత ఎల్.వి. ప్రసాద్, ఆర్టిస్టులు కిళ్లీలు వేసుకుంటే పళ్లు గారపట్టి అసహ్యంగా కనిపిస్తాయని చెప్పడంతో ఎన్టీఆర్ ఆ అలవాటును పూర్తిగా వదిలేశారని అప్పటి ఫిల్మ్ జర్నలిస్టులు చెబుతుంటారు.

వెంకటేశ్వర స్వామి అంటే ఎన్టీఆర్‌కు ఎంతో భక్తి. అందుకే భక్తి భావంతో ప్రతి శనివారం నేలపై పడుకునేవారు. తల్లి గౌరీ భక్తురాలు కావడంతో, ఆమె మరణం తర్వాత శివుని పట్ల భక్తితో సోమవారం కూడా నేలపై నిద్రించేవారు. తన బిజీ షెడ్యూల్‌లో కూడా రోజుకు రెండు కాల్ షీట్‌లు పనిచేసేవారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక కాల్ షీట్, మధ్యాహ్నం 2 గంటల నుంచి మరో కాల్ షీట్. ఒక్కో సినిమాకు 30 కాల్ షీట్‌లు కేటాయించేవారు. విఠలాచార్య వంటి దర్శకులు ఇంకా తక్కువ వ్యవధిలోనే ఎన్టీఆర్ తో తమ సినిమాలు పూర్తి చేసేవారు. తన బిడ్డలు కేవలం తన ఆస్తికి మాత్రమే వారసులు కాకుండా, తనకు నిజమైన వారసులుగా నిలవాలని ఎన్టీఆర్ కోరుకునేవారు. అందుకే హరికృష్ణను, బాలకృష్ణను నటులుగా పరిచయం చేశారు. మరో బిడ్డ మోహనకృష్ణ సినిమాటోగ్రాఫర్‌గా కూడా పనిచేశారు. హరికృష్ణ కొన్ని చిత్రాల్లో నటించిన తర్వాత నిర్మాతగా స్థిరపడ్డారు. ఆయన కుమారులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా కొనసాగుతూ తమ తాతగారి వారసత్వాన్ని నిలబెడుతున్నారు. అలాగే, తండ్రి ఆశయాలకు అనుగుణంగా మెలుగుతూ బాలకృష్ణ అగ్ర హీరోలలో ఒకరిగా రాణిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.