LB Sriram: ఆ స్టార్ డైరెక్టర్ పెట్రోల్‌కి డబ్బులు నన్ను అడిగాడు.. వేషాలు ఇవ్వమని అడిగితే మాత్రం..

నటుడు ఎల్‌.బి. శ్రీరామ్ దర్శకుడు వి.వి. వినాయక్‌తో తన బంధం గురించి మాట్లాడారు. తమ ఇద్దరి మధ్య పెట్రోల్ డబ్బులు కూడా లేని గత జ్ఞాపకాలను పంచుకున్నారు. వినాయక్ తన నటనకు ఒక మెట్టు పైకి ఎత్తారని, అయితే ప్రస్తుత సినిమాల్లో తాను లేకపోవడంపై..

LB Sriram: ఆ స్టార్ డైరెక్టర్ పెట్రోల్‌కి డబ్బులు నన్ను అడిగాడు.. వేషాలు ఇవ్వమని అడిగితే మాత్రం..
Lb Sriram

Updated on: Mar 23, 2026 | 8:17 PM

తెలుగు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ అనుభవం ఉన్న నటుడు, రచయిత ఎల్‌.బి. శ్రీరామ్, ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్‌తో తనకున్న అనుబంధం, సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈవీవీ సత్యనారాయణ తనకు నటుడిగా అవకాశం ఇచ్చినా, వి.వి. వినాయక్ తన నటనను ఒక మెట్టు పైకి తీసుకెళ్లారని, తన కెరీర్‌లో అత్యంత కీలక పాత్ర పోషించారని శ్రీరామ్ స్పష్టం చేశారు. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన దిల్ లాంటి చిత్రాలు తన నటనకు కొత్త ప్రామాణికం చేకూర్చాయని ఆయన గుర్తు చేసుకున్నారు.

వినాయక్ దర్శకుడిగా ఎప్పుడు అవుతారా అని తాను ఎదురు చూసేవాడినని శ్రీరామ్ తెలిపారు. “తొందరగా డైరెక్టర్ అయితే నాలాంటి వాడికి హెల్ప్ అవుతుంది” అని అప్పట్లో అనుకునేవాడినని చెప్పారు. తమ మధ్య స్నేహం, ఆత్మీయత చాలా బలమైనవని, వినాయక్ ఎప్పుడూ తన గురించి గొప్పగా చెబుతారని, తన సర్కిల్‌లో తన ప్రస్తావన వస్తూనే ఉంటుందని శ్రీరామ్ వెల్లడించారు. అయితే, ఇంతటి ఆత్మీయత, బలమైన బంధం ఉన్నప్పటికీ వినాయక్ సినిమాల్లో తాను ఎందుకు కనిపించడం లేదని చాలామంది తనను అడుగుతున్నారని ఎల్‌.బి. శ్రీరామ్ పేర్కొన్నారు. మొదట్లో తాను మంచి వేషం దొరకకపోవడం లేదా చిన్న వేషం ఇవ్వడం వినాయక్‌కు ఇష్టం లేకపోవడం వంటి కారణాలు అనుకునేవాడినని అన్నారు. తామిద్దరం ఆ తర్వాత చాలాసార్లు కలిశామని.. కానీ ఎక్కడా ఈ పాత్రల గురించి మాట రాలేదని శ్రీరామ్ అన్నారు. తానే వెళ్లి అడిగినప్పుడు.. సరైన వేషం దొరకలేదని.. మంచి వేషం కోసం చూస్తున్నానని వినాయక్ చెప్పినట్టు చెప్పారు. ఆపై పరిస్థితుల బట్టి తాను అసలు దృష్టిలోనే లేకపోయి ఉండొచ్చునని ఎల్బీ శ్రీరామ్ అన్నారు.

తమ స్నేహం ఎంత లోతైనదో చెప్పడానికి శ్రీరామ్ ఒక సంఘటనను పంచుకున్నారు. ప్రారంభ రోజుల్లో, ఒకసారి అబిడ్స్‌లోని ఒక థియేటర్‌కు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన దౌడ్ సినిమా చూడటానికి బైక్‌పై వెళ్లాం. సినిమా హాలుకు దగ్గర్లో పెట్రోల్ అయిపోయిందని, అప్పుడు తమ ఇద్దరి వద్ద ఒక్క పైసా కూడా లేదని శ్రీరామ్ గుర్తుచేసుకున్నారు. చివరికి, బైక్‌ను తోసుకుంటూ వెళ్లారు. అప్పుడు రోడ్డుపై ఎదురైన బిచ్చగాళ్లు, వ్యాపారుల కష్టాలను చూసి, “మన పరిస్థితి లాగే వీళ్ళ పరిస్థితి కూడా ఉంది” అని ఇద్దరూ అనుకున్నారని, అప్పుడు తమకు దేశం మొత్తం అదే పరిస్థితిలో ఉన్నట్లు అనిపించిందని శ్రీరామ్ ఆనాటి సంఘటనను వివరించారు.

ఇది చదవండి: చనిపోయే ముందు సౌందర్య గర్భవతి.. ప్రేమించింది అతడినే.! ఎవ్వరికీ తెలియని నిజం

Follow Us