ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. నేను శైలజ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించింది. అతి తక్కువ సమయంలోనే అగ్రకథానాయికగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీకి ప్రతిభకు తగిన అవకాశాలు మాత్రం రావట్లేదు. తెలుగు, తమిళం, హిందీలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది కీర్తి సురేష్. చివరగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో కనిపించిన కీర్తి.. ప్రస్తుతం బాలీవుడ్లో రెండు సినిమాల్లో నటిస్తుంది. అలాగే తమిళంలో రఘు తాతా అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
సుమన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న రఘు తాతా చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇందులో ఎంఎస్ భాస్కర్, రవీంద్ర విజయ్, దేవదర్శిని, రాజీవ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. షాన్ రోల్డన్ సంగీతం అందిస్తుండగా.. ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది. టీజర్, పోస్ట్రర్స్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది చిత్రయూనిట్. కీర్తి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
హృదయాన్ని కదిలించే రఘు తాతా చిత్రం 2024 ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతుంది అంటూ ట్వీట్ చేసింది కీర్తి సురేష్. ఇదిలా ఉంటే అదే రోజున స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందుతున్న పుష్ప 2 చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీపై ఓ రేంజ్ హైప్ నెలకొంది. తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పుష్ప 2 చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇటీవల విడుదలైన కపుల్ సాంగ్ నెట్టింట ట్రెండ్ అవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.