
2008 సినిమా అవార్డ్స్ వేడుకలో ఉత్తమ నటుడు పురస్కారం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కు లభించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అందుకోవడం విశేషం. అవార్డు స్వీకరించిన అనంతరం జూనియర్ ఎన్టీఆర్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తొలుత, ఈ అవార్డును తనకు ప్రదానం చేసిన టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తనను ప్రోత్సహిస్తున్న అభిమానులకు, తన తాతగారు నందమూరి తారక రామారావు గారి అభిమానులకు, అలాగే నందమూరి వంశాభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు. యమదొంగ సినిమాకు దర్శకత్వం వహించి, తనను స్లిమ్‌గా, ట్రిమ్‌గా తీర్చిదిద్దిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. ఈ సినిమా విజయానికి కృషి చేసిన ప్రతి సాంకేతిక నిపుణుడికి కూడా ధన్యవాదాలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి సీనియర్ నటుల సినిమాలు చూసే తాము ఎదిగామని, వారే తమకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. ‘నేడు మేము ఇంత అద్భుతంగా డ్యాన్సులు, నటన ప్రదర్శిస్తున్నామంటే అది సీనియర్లు నేర్పించిందే, వారి సినిమాలు చూసి నేర్చుకున్నదే’ అని వినయంగా చెప్పాడు తారక్.
ఈ ప్రసంగంలో అత్యంత భావోద్వేగభరిత ఘట్టం దివంగత నటుడు శోభన్ బాబును స్మరించుకోవడమే. శోభన్ బాబు మరణించినప్పుడు తాను వారి అంత్యక్రియలకు కూడా వెళ్లలేని స్థితిలో ఉన్నానని.. ఆయన భౌతికఖాయాన్ని కూడా దర్శించే అర్హత తనకి లేదని పేర్కొంటూ తన బాధను వ్యక్తం చేశారు. ఈ అవార్డును శోభన్ బాబుకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ అవార్డును వారి కుటుంబ సభ్యులకు అందించాల్సిందిగా మెగాస్టార్ చిరంజీవిని అభ్యర్థించారు. ఇది జూనియర్ ఎన్టీఆర్ సంస్కారానికి, పెద్దల పట్ల ఆయనకున్న గౌరవానికి నిదర్శనమని వ్యాఖ్యాత ప్రశంసించారు. శోభన్ బాబుకు యంగ్ ఆర్టిస్టులలో మహేష్ బాబు, ఆ తర్వాత ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని చిరంజీవి గుర్తు చేశారు. ఈ అవార్డు శోభన్ బాబు ఆశీస్సులను ఎన్టీఆర్‌కు అందిస్తుందని మెగాస్టార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..