ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు జగపతిబాబు. ఫ్యామిలీ హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు జగపతి బాబు. ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న జగపతి బాబు తిరిగి విలన్‌గా ఎంట్రీ ఇచ్చారు. నటసింహం బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాతో జగపతి బాబు విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. విలన్ గా విశ్వరూపం చూపించారు జగ్గూభాయ్ . ఆ తర్వాత పలు సినిమాల్లో విలన్ గా హీరో ఫాదర్ గా నటిస్తూ అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే జగపతి బాబు చేసిన సేవాకార్యక్రమాలు గురించి బయట పెద్దగా చెప్పుకోరు. చేసిన సాయం గురించి ప్రచారం చేసుకోవడం ఆయనకు ఇష్టం ఉండదు. అయితే తాజాగా ఆయన ఓ పేద విద్యార్థికి చేసిన సాయం తెలిసి అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
సైదాబాద్‌కు చెందిన జయలక్ష్మి అనే విద్యార్థికి జగపతి బాబు అండగా నిలిచారు. జయ లక్ష్మి వరల్డ్ చిల్ట్రన్స్ పార్లమెంట్ ప్రధానిగా వ్యవహరిస్తోంది. డిగ్రీ చదువుతూనే పలు రకాల సామాజిక సమస్యలపై పోరాటం చేస్తోంది. అయితే ఆమె సివిల్స్ చదవాలని చూస్తోంది. అయితే ఆర్ధిక సమస్య కారణంగా ఆమె ఇబ్బంది పడుతోంది. ఆమెను చదివించడానికి ఆమె తల్లిదండ్రులు చాలా కష్టపడుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ చెత్త సేకరిస్తున్నారు ఆమె తల్లిదండ్రులు.
అయితే జయలక్ష్మి గురించి ఒక ప్రముఖ దినపత్రికలో ఆర్టికల్ వచ్చింది. అది చదివిన జగపతి బాబు తల్లి ఆమె కు సాయం చేయాలనీ జగపతికి సూచించింది. అమ్మ ఆడితే కాదంటారా.. వెంటనే ఆమెకు సాయం చేస్తా అని అమ్మకు మాట ఇచ్చేశారు జగపతి బాబు. ఆయన జయలక్ష్మికి అండగా నిలిచారు. జయలక్ష్మిని పిలిపించి మాట్లాడారు. సివిల్స్ శిక్షణ కోసం అవసరమైన ఆర్థిక సాయం చేస్తానని కష్టపడి చదవాలని ఆమెకు సూచించారు జగపతిబాబు.