
లగ్జరీ లైఫ్, లక్షల జీతం అందించే ఉద్యోగాన్ని వదిలి పెట్టి మరీ ఇండస్ట్రీలోకి వచ్చాడు కార్తీక్. తన కామెడీతో బుల్లితెరపై మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ షోలో ఓ సాధారణ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన కార్తిక్ ఆ తర్వాత టీమ్ లీడర్ గా ఎదిగిపోయాడు. ‘కెవ్వు కార్తిక్’ పేరుతో స్కిట్స్ చేసి బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తున్నాడు కార్తిక్. అలాగే అప్పుడప్పుడు సినిమాల్లోనూ కనిపిస్తున్నాడు. టీవీ షోస్, సినిమాల సంగతి పక్కన పెడితే.. సుమారు రెండేళ్ల క్రితం సిరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కార్తిక్. తమ పండంటి కాపురానికి ప్రతీకగా ఇటీవలే ఈ దంపతులకు ఒక అమ్మాయి జన్మించింది. తాజాగా తమ కూతురికి అన్న ప్రాసన వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్తీక్ దంపతులు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తన కూతురికి శ్రీకరి అని నామకరణం చేసినట్లు కార్తీక్ తెలిపాడు. అనంతరం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ వేడుకల్లో పట్టు వస్త్రాల్లో ఎంతో చూడముచ్చటగా కనిపించారు కార్తీక్- సిరి. అలాగేవారి కూతురు శ్రీకరి కూడా ఎంతో క్యూట్ గా కనిపించింది. ఈ ఫొటోలను చూసిన సినీ అభిమానులు, బుల్లితెర సెలబ్రిటీలు, నెటిజన్లు కెవ్వు కార్తీక దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక కార్తీక్ విషయానికి వస్తే.. తెలంగాణలోని వరంగల్ ఇతని సొంతూరు. తండ్రి ఆర్టీసీ బస్ కండక్టర్ కాగా, తల్లి దుస్తులు కుడుతూ కుటుంబానికి తోడుగా నిలిచింది. ఇక చదువులో చురుకైన కార్తీక్ రామప్ప ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు. అక్కడ చదువుతూనే కాకతీయ యూనివర్సిటీలో మిమిక్రీలో డిప్లమా కూడా పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎంటెక్ పట్టా కూడా అందుకున్నాడు. చదువు పూర్తయిన తర్వాత కొన్ని రోజుల పాటు ఉద్యోగం కూడా చేశాడు. కానీ రిజైన్ చేశాడు. కొన్ని రోజుల పాటు ఈవెంట్ ఆర్గనైజర్ గా కూడా చేశాడు. చిన్నచిన్న స్టేజి షోలు, మిమిక్రీ పెర్ఫార్మన్స్ లు చేస్తూ కుటుంబాన్ని పోషించాడు. ఇదే క్రమంలో జబర్దస్త్ లోకి అడుగు పెట్టాడు. తన ట్యాలెంట్ తో టీమ్ లీడర్ గా ఎదిగాడు. ప్రస్తుతం పలు టీవీ షోల్లో సందడి చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు కార్తీక్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.