
Hyderabad Drugs Case: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. గట్టి నిఘా పెట్టిన పోలీసులు.. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ కు చెందిన ఓ హీరో ప్రియురాలు డ్రగ్స్ తో పట్టుబడటం సంచలనంగా మారింది. నార్సింగి డ్రగ్స్ కేసులో లావణ్యను అదుపులోకి తీసుకున్న నాటి నుంచి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు మొత్తం లావణ్య చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె బ్యాక్‌గ్రౌండ్ తవ్వితీస్తున్నారు పోలీసులు. ఎవరీ లావణ్య? బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? విజయవాడ నుంచి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చింది లావణ్య. జల్సాలకు అలవాటుపడి టాలీవుడ్‌లో ఛాన్స్‌ల కోసం యత్నించింది. మ్యూజిక్ టీచర్‌గా పనిచేస్తూ చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. షార్ట్ ఫిలిమ్స్‌లో హీరోయిన్‌గా నటిస్తూ జల్సాలకు అలవాటు పడింది లావణ్య. ఒక హీరోకు పరిచయమై లవర్‌గా మారింది.
అయితే, మోకిలా డ్రగ్స్ కేసులోనూ నిందితురాలుగా ఉంది లావణ్య. కొంతమంది సింగర్లు, ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు ఆమెకు కాంటాక్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లావణ్య కోకాపేటలో ఓ విల్లాలో నివాసం ఉంటోంది. గతంలో వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులోను లావణ్య నిందితురాలిగా ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అరెస్ట్ నుంచి తప్పించుకున్న ఆమె కదలికలపై పోలీసులు ఫోకస్ పెంచారు. ఆమె దగ్గర లభించిన డ్రగ్స్‌పై ఆరా తీస్తున్నారు. డ్రగ్స్ తాను స్వీకరించేందుకు తీసుకుందా లేదా ఎవరికైనా అమ్మడానికా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇవాళ కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్న నార్సింగి పోలీసులు.. మరింత లోతుగా విచారణ జరిపేందుకు సిద్ధమవుతున్నారు.
లావణ్య.. చిత్ర పరిశ్రమలో పలువురికి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. లావణ్య సోషల్ మీడియా అకౌంట్‌లతో పాటు వ్యక్తిగత చాట్ పరిశీలిస్తున్నారు. లావణ్యకు చాలామంది వీఐపీలతో పరిచయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కోర్టు అనుమతితో లావణ్యను కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు సిద్ధమయ్యారు పోలీసులు.
అయితే, లావణ్య మొబైల్ డేటాలో పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. గోప్యంగా విచారణ జరుపుతున్న సైబరాబాద్ పోలీసులు.. డ్రగ్స్ గుట్టును లాగేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే లావణ్య నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే.. లావణ్య కేసుపై నార్కొటిక్ బ్యూరో అధికారులు సైతం ఆరా తీస్తున్నారు. డ్రగ్స్ దందాలో ఎవరెవరు ఉన్నారన్న విషయాలను తెలుసుకుంటున్నారు.
నార్సింగి డ్రగ్స్ కేసులో లావణ్యను అదుపులోకి తీసుకున్న నాటి నుంచి పోలీసులు గోప్యంగా విచారణ జరుపుతున్నారు. డ్రగ్స్ దందాలో ఎవరెవరు ఉన్నారన్న విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..