దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం సృష్టించిన ప్రభంజనం గురించి చెప్పక్కర్లేదు. యావత్ ప్రపంచమే ఈ సినిమాకు ఫిదా అయ్యింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన అద్భుతమంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. రూ. 400 కోట్లతో నిర్మించిన ఈ చిత్రానికి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది. అలాగే ఈ సినిమాపై జక్కన్న టెకింగ్ పై హాలీవుడ్ డైరెక్టర్స్ పొగడ్తలు కురిపించారు. తాజాగా మరో హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. టైటానిక్, అవతార్, అవతార్ 2 వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ జేమ్స్ కామెరూన్ ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకలలో రాజమౌళిని కలుసుకున్నారు. జక్కన్న టేకింగ్.. ఆయన మేధావి కథనం.. పాత్రలను నడిపించే భావోద్వాగాలపై ప్రశంసలు కురిపించారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి మాట్లాడారు. “ఇది నిజంగా చాలా గొప్ప విజయం. ఆర్ఆర్ఆర్ ఎంతో అద్భుతమైన చిత్రం. నేను మొదటిసారి ఈ సినిమా చూసి ఆశ్చర్యపోయాను. సినిమా అంటే కేవలం గ్రాఫిక్స్ మాత్రమే కాదు.. కథ చెప్పడంలో రాజమౌళి షేక్స్పియర్… క్లాసిజం ఉంది. ఇందులో రామ్ చరణ్ పాత్ర.. నటన మరో స్థాయిలో ఉంది. రాజమౌళితో వీటన్నిటి గురించి వివరంగా మాట్లాడాలనుకున్నాను.. కానీ అతడిని కలిసినప్పుడు అంత సమయం దొరకలేదు. అందుకే సరిగ్గా మాట్లాడలేకపోయాను. ఈ సినిమా గురించి అతడితో ఇంకా మాట్లాడాలని నేను అనుకుంటున్నాను ” అంటూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు కోసం పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం చారిత్రాత్మక చిత్రం 28వ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో ‘ఉత్తమ విదేశీ భాషా చిత్రం’, ‘ఉత్తమ పాట’ అవార్డ్స్ కూడా గెలుచుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.