Waheeda Rehman Birthday: వహీదా రెహమాన్.. ఒకప్పటి అందాల తార. ఈ తరంవారికి ఈమె గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. అప్పటి తరానికి కలల రాణి. ఆమె సమ్మెహన శక్తి అలాంటిది.. ఇవాళ ఆమె పుట్టిన రోజు. చాలా చోట్ల మే 14 వహీదా పుట్టిన రోజు అని ఉంటుంది కానీ, అది తప్పు. చాలా మంది వహీదా (WAHEEDA REHMAN)తెలుగమ్మాయి అనుకుంటారు కానీ అది కూడా తప్పే! ఆమె అచ్చమైన తమిళనాడు ముస్లిము. ఆమె తండ్రి మొహమ్మద్ అబ్దుర్ రెహమాన్ ఉద్యోగరీత్యా ఆంధ్రలో చాలాకాలం గడిపారు. అలా వహీదా రోజులు మారాయి, జయసింహ’సినిమాలు విడుదలైనప్పుడు ఆయన విజయవాడలో మునిసిపల్ కమీషనర్‌గా పనిచేస్తున్నారు. వహీదా చదివింది కూడా ఇక్కడే కాబట్టి తెలుగు బాగా వచ్చు. చిన్నప్పుడే శాస్త్రీయ నృత్యం కూడా నేర్చుకున్నారు. ఎన్టీఆర్ (NTR)తన ఎన్‌ఏటీ పతాకంపై నిర్మించిన మూడో సినిమా జయసింహ. ఇందులో ఓ నాయికగా అంజలీదేవిని ఎంచుకున్నారు. రాజకుమారి పాత్రను కొత్త నటితో వేయించాలనుకున్నారు. అలా వహీదా రెహమాన్‌ను ఆ పాత్రకు తీసుకున్నారు. అయితే అంతకు ముందే వహీదా డాన్స్ గురించి తెలుసుకున్న దర్శకుడు తాపీ చాణక్య తన రోజులు మారాయి సినిమాలో ఏరువాక సాగారో పాటకు నర్తించే అవకాశం ఇచ్చారు. అలా వెండితెర మీద మొదటిసారిగా వహీద మెరిశారు. రోజులు మారాయి, జయసింహల తర్వాత ఎమ్జీఆర్, భానుమతి (BHANUMATHI)నటించిన రంగుల చిత్రం ఆలీబాబా 40 దొంగలు లోనూ ఓ నృత్యగీతంలో తళుక్కుమన్నారు వహీదా.
హిందీలో వహీదాను పరిచయం చేసింది గురుదత్ (GURUDATH). బాజ్ సినిమా తర్వాత గురుదత్ ఆర్‌పార్, మిస్టర్ అండ్ మిసెస్ సినిమాలు తీశారు. ఈ రెండింటికీ ఆయనే నిర్మాత, దర్శకుడు. ఈ రెండూ హిట్టవ్వడంతో దేవానంద్, షకీలాలతో సీఐడీ సినిమా ప్లాన్ చేశారు. దర్శకత్వ బాధ్యతను తన శిష్యుడు రాజ్ ఖోస్లాకు అప్పగించారు. ఈ సినిమాతోనే వహీదా హిందీ సినిమాకు పరిచయమయ్యారు.
ఈ సినిమా నిర్మాణం జరుగుతున్న సమయంలోనే అప్పటికే పెళ్లయిన గురుదత్ వహీదాతో ప్రేమలో పడ్డాడు. సినిమాకు ఇస్తానన్నరెమ్యూనిరేషన్‌తో పాటు అదనంగా ఆమెకు ఒక కారు కానుకగా ఇచ్చాడు గురుదత్. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్టయింది.. వహీదాకు వేషాలు వెతుక్కుంటూ వచ్చాయి..1971లో వచ్చిన రేష్మా ఔర్ షేరా సినిమాకుగాను ఆమెకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు లభించింది. 1972లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ పురస్కారాలు వచ్చాయి. 2006లో ఎన్టీఆర్ జాతీయ అవార్డును అందుకున్నారు. చాలా రోజుల తరువాత రోజులు మారాయి హీరో అక్కినేని నటించిన బంగారు కలలు సినిమాలో ఆయనకు సోదరిగా నటించారు వహిదా. ఆ తరువాత 1986లో కృష్ణ (KRISHNA)తొలిసారి దర్శకత్వం వహించిన సింహాసనంలో రాజమాతగా అభినయించారు. 2006లో సిద్ధార్థ్ హీరోగా రూపొందిన చుక్కల్లో చంద్రుడులో మళ్లీ ఎఎన్‌ఆర్(ANR)తో కలిసి నటించారు వహీదా రెహమాన్ .
బంగారు కలలు సినిమాలో నటించడానికి ముందు మద్రాస్ ఎయిర్‌పోర్ట్‌లో అన్నపూర్ణ సంస్థ అధినేత దుక్కిపాటి మధుసూదనరావుకు ఎదురుపడ్డారు. 1951లో తెనాలిలో నృత్య ప్రదర్శన ఇచ్చినప్పటి నుంచి వహీదా మధుసూదనరావుకు తెలుసు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పారు వహీదా. వెరీ గుడ్.. పెళ్లి చేసుకోబోయే ముందు ఓ తెలుగు సినిమాలో నటించవచ్చు కదా అని అన్నారు మధుసూదనరావు. మీరు తీస్తానంటే నేను కాదంటానా అని అన్నారు వహీదా. అలా బంగారు కలలలో నటించారు. నిజానికి ఆ సినిమాలో ఎన్‌ఆర్ పక్కన మహీదా నటించాల్సి ఉండాలి. ఆ సినిమాలో ముఖ్యమైన చెల్లెలు పాత్రకు లక్ష్మిని ఎంపిక చేశారు. అయితే అదే సమయంలో చలం నిర్మించిన దేవుడమ్మ సినిమాలో కూడా లక్ష్మిది ఇలాంటి పాత్రే కావడంతో పోలిక వస్తుందని భయపడి హీరోయిన్‌గా లక్ష్మిని పెట్టుకున్నారు. మరి చెల్లెలు పాత్రకు వహీదా ఒప్పుకుంటారా అన్న సందేహం వచ్చింది అన్నపూర్ణ వాళ్లకు. ఒప్పుకుంటే ఒప్పుకుంటారు లేకపోతే లేదనుకునేసి విషయం అంతా చెప్పారు. ‘నేను ఆర్టిస్టును. చేసే పాత్ర మంచిదా కాదా అన్నదే చూస్తాను తప్ప హీరోయిన్ వేషమే వేయాలన్న పట్టింపు నాకు లేదు. నేను చెల్లెలు పాత్ర వేయడానికి సిద్ధమే’ అని చెప్పారు వహీదా. ఈ సందర్భంగా మరో విషయాన్ని కూడా చెప్పుకోవాలి. బంగారు కలలు సినిమాలో నటించడానికి బాంబే నుంచి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తన వెంట కేవలం ఓ టచప్ వుమెన్‌ను మాత్రమే తెచ్చుకున్నారు. పాత్రకు కావల్సిన కాస్ట్యూమ్స్, మేకప్ మేటిరియల్‌ను కూడా బాంబే నుంచి ఆమె తెచ్చుకున్నారు. వహీదా కోసం రిట్జ్ హోటల్‌లో రూమ్ బుక్ చేయాలనుకున్నారు నిర్మాతలు. ఆమె మాత్రం ఎందుకండి దండగ. నేను సారథి స్టూడియోలోనే ఉంటానని చెప్పారట. చివరకు ఎలాగో అలాగ ఆమెను ఒప్పించి బ్లూ మూన్ హోటల్‌లో బస కల్పించారు. అది ఆమె గొప్పదనం. వహిదా రెహమాన్ ను గురుదత్ ఎంతగానో ప్రేమించారు. అయితే, అప్పటికే ఆయనకు వివాహమయింది. ఆ తరువాత గురుదత్ అర్ధాంతరంగా జీవితం చాలించారు. తనతో షగున్‌లో హీరోగా నటించిన కమల్ జీత్ ను 1974లో వివాహమాడారు వహిదా రెహమాన్. వారికి ఇద్దరు పిల్లలు.