
మునుపటి కంటే చాలా సన్నగా, జీరో సైజ్ ఫిగర్‌తో మెరిసిపోతున్న ఆమెను చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ మార్పు వెనుక ఏదో కఠినమైన డైట్ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ భామ మాత్రం “నేను అస్సలు డైటింగ్ చేయను” అని చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. డైట్ చేయకుండా అంత బరువు తగ్గడం సాధ్యమేనా? అసలు ఆమె ఫాలో అవుతున్న ఆ సీక్రెట్ ట్రిక్ ఏంటి? బరువు తగ్గాలనుకునే వారికి ఆమె ఇస్తున్న సలహాలేంటో చూద్దాం..
‘దేశముదురు’తో తెలుగు తెరపై మెరిసిన నటి హన్సిక మోత్వాని. ఇటీవల తన బరువును గణనీయంగా తగ్గించుకున్నారు. ఇందుకోసం ఆమె ఏం చేసిందన్న విషయం ఒక తాజా ఇంటర్వ్యూలో వెల్లడైంది. ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ ఆమెను ఇంటర్వ్యూ చేయగా.. ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. “నేను ఎలాంటి డైట్‌లో లేను మేడమ్” అని హన్సిక చెప్పడంతో ఫరా ఖాన్ ఆశ్చర్యపోయారు. ఆహారం విషయంలో కఠినమైన నియమాలు పెట్టుకోకుండానే ఇంత ఫిట్‌గా ఉండటం ఎలా సాధ్యమని ఆరా తీయగా.. హన్సిక తన ఫిట్‌నెస్ మంత్రాన్ని బయటపెట్టారు.
డైట్ లేకుండా బరువు తగ్గడం ఎలా సాధ్యమని అడగ్గా.. “నేను పైలేట్స్ అమ్మాయిని” అని హన్సిక గర్వంగా సమాధానం ఇచ్చారు. పైలేట్స్ అనేది శరీర బలం, ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్స్ మెరుగుపరచడానికి రూపొందించిన ఒక ప్రత్యేకమైన వ్యాయామం. ఇది ముఖ్యంగా పొత్తికడుపు, నడుము, వెనుక కండరాలను బలోపేతం చేస్తుంది. జిమ్‌లో గంటల తరబడి బరువులు ఎత్తడం కంటే.. శరీరాన్ని విభిన్న కోణాల్లో కదిలించే ఈ వ్యాయామమే తన ఫిట్‌నెస్‌కు కారణమని ఆమె స్పష్టం చేశారు.
గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా హన్సిక తన ఇష్టాయిష్టాలను పంచుకున్నారు. “వెయిట్ ట్రైనింగ్ చేయడం నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకే మొత్తం శరీరాన్ని కదిలించే వ్యాయామాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను” అని తెలిపారు. రోజూ పైలేట్స్‌తో పాటు స్విమ్మింగ్, డ్యాన్స్, యోగా చేయడం ద్వారా తన శరీరంలోని అదనపు కేలరీలను కరిగిస్తానని ఆమె చెప్పారు. అనవసరమైన కేలరీల కంటే ఎక్కువ కొవ్వును శరీరం నిల్వ చేసినప్పుడు మనం లావుగా కనిపిస్తామని, దాన్ని సరైన శారీరక శ్రమతో కరిగించవచ్చని హన్సిక నిరూపించారు.
కఠినమైన డైట్ చేయకపోయినా.. హన్సిక పోషక విలువలున్న ఆహారం తీసుకోవడంపై దృష్టి పెడతారు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరగకుండా జాగ్రత్త పడవచ్చని ఆమె చెబుతున్నారు. బరువు తగ్గడం ఒక ఎత్తు అయితే.. దాన్ని అలాగే నిలబెట్టుకోవడం మరో ఎత్తు. ప్రస్తుతం ఆమె తన బరువును మేనేజ్ చేయడానికి ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవుతున్నారు.
ప్రస్తుతం హన్సిక తన కెరీర్ పరంగా కూడా చాలా బిజీగా ఉన్నారు. ఆర్. కన్నన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గాంధారి’ సినిమాలో ఆమె నటిస్తున్నారు. ఇది ఒక ఎమోషనల్ హారర్ థ్రిల్లర్ కాగా.. ఇందులో హన్సిక ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. సరికొత్త లుక్‌తో ఆమె ఈ సినిమాలో అలరించబోతున్నారు. బరువు తగ్గడం అంటే ఆకలితో అలమటించడం కాదు.. సరైన వ్యాయామం, ఆహారపు అలవాట్లను అలవరుచుకోవడమే అని హన్సిక నిరూపించారు. పైలేట్స్ వంటి వ్యాయామాలతో ఆరోగ్యంగా, అందంగా ఉండవచ్చని ఆమె ప్రయాణం స్పష్టం చేస్తోంది.