వంగవీటి రాధ, జార్జిరెడ్డి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు హీరో సందీప్ మాధవ్. తాజాగా శాండీ మరో సినిమా గంధర్వతో రాబోతున్నాడు. ఈ సినిమాలో గాయత్రి ఆర్. సురేష్, అక్షత శ్రీనివాస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ అండ్ ఎం క్రియేషన్స్ వీరశంకర్ సిల్వర్ స్కీృన్స్ బ్యానర్లపై యం.యన్. మధు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
కాగా ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్ 27న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టారు. అనంతరం శ్రీకాంత్ కెమెరా స్వీచ్ ఆన్ చేశారు. ఈ సన్నివేశానికి క్రిష్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ.. “జార్జిరెడ్డి సినిమా తర్వాత చాలా కథలు విన్నాను. అన్నీ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో ఉన్నాయి. దర్శకుడు అప్సర్ చెప్పిన కథ కొత్తగా ఉండడంతో వెంటనే ఓకే చెప్పేశా. సాయికుమార్, సురేష్, బాబుమోహన్ లాంటీ సీనియర్ నటులతో కలిసి నటించనుండడం చాలా సంతోషంగా ఉంది” అని తెలిపారు.
అటు డైరెక్టర్ అప్సర్ మాట్లాడుతూ.. “వీరశంకర్ గారికి చాలా కథలు చెప్పాను. కానీ ఆయన ఇంకా బాగుండాలి, ఇంకా ఆలోచించు అని చెప్పారు. దీంతో చాలా రోజులు తర్వాత మంచి కాన్సెప్ట్‌తో వెళ్ళి వీరశంకర్ గారికి చెప్పాను. ఆయన వెంటనే ఓకే చెప్పారు. శాండీ చేస్తున్నది మిలటరీ క్యారెక్టర్ అయినా ఫ్యామిలీ సెంటిమెంట్, కామెడీ, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి. గంధర్వ అంటే నిత్య యవ్వనంలా ఉండటం అని అర్థం. హిలేరియస్ ఇంటెన్సిటీ ఉంటుంది. కాగా వచ్చే ఏడాది మే 21న ఈ సినిమాను విడుదల చేయడానికి మా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు” అని అన్నారు.