Tollywood: ఇండస్ట్రీకి పనికిరావన్నారు.. కట్ చేస్తే స్టార్ హీరోయిన్‌ హోదా! ఇప్పుడు కీలక పాత్రలకు కేరాఫ్‌గా సీనియర్ హీరోయిన్

సినిమా ప్రపంచం చాలా క్రూరమైనది. ఇక్కడ సక్సెస్ ఉంటేనే గౌరవం, లేదంటే ఐరన్ లెగ్ అనే ముద్ర వేసి పక్కన పెట్టేస్తారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఈ ఒత్తిడి మరీ ఎక్కువగా ఉంటుంది. కెరీర్ మొదట్లోనే వరుసగా ఫ్లాపులు పడితే, ఇక ఆమె కథ ముగిసిందని అందరూ తీర్మానం చేసేస్తారు.

Tollywood: ఇండస్ట్రీకి పనికిరావన్నారు.. కట్ చేస్తే స్టార్ హీరోయిన్‌ హోదా! ఇప్పుడు కీలక పాత్రలకు కేరాఫ్‌గా సీనియర్ హీరోయిన్
Senior Star Heroine

Updated on: Jan 23, 2026 | 10:52 PM

సరిగ్గా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంది ఒకప్పటి ఆ గ్లామర్ క్వీన్. దీపిక పదుకొనె, ఆలియా భట్ వంటి నేటి తరం నటీమణుల కంటే ముందే రూ.1000 కోట్ల సినిమాలో కీలక పాత్ర పోషించి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు తన కూతురు నటన చూసి “అసలు నువ్వు ఇండస్ట్రీలో ఎలా సర్వైవ్ అవుతావు?” అని ఆమె తల్లి సైతం ప్రశ్నించింది. కానీ, పట్టు వదలకుండా పోరాడి నేడు ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగింది. ఆమే మనందరి ప్రియతమ నటి, రాజమాత రమ్యకృష్ణ. ఆమె సినీ ప్రయాణంలోని ఆసక్తికర మలుపులేంటో తెలుసుకుందాం..

Ramya Krishnann

వరుస ఫ్లాపులతో..

1970లో చెన్నైలో జన్మించిన రమ్యకృష్ణకు సినిమా నేపథ్యం ఉన్న కుటుంబమే. తమిళ నటుడు రామస్వామి ఆమెకు పెద్దనాన్న కావడంతో చిన్నప్పుడే ఇండస్ట్రీ వైపు ఆకర్షితురాలైంది. అయితే, ఆమె కెరీర్ ఆరంభం మాత్రం పూలబాట కాలేదు. నటించిన మొదటి సినిమా విడుదలకు నోచుకోలేదు. ఆ తర్వాత వచ్చిన వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. తమిళ, తెలుగు ఇండస్ట్రీలో ఏ ఒక్క సినిమా కూడా సక్సెస్ ఇవ్వకపోవడంతో, “నేను మంచి పర్ఫార్మర్ కాదేమో” అనే అనుమానం ఆమెలో మొదలైంది.

ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్రతో బాధపడుతున్న సమయంలో కళాతపస్వి కె. విశ్వనాథ్ ఆమెకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. 1989లో వచ్చిన ‘సూత్రధారులు’ సినిమా రమ్యకృష్ణ కెరీర్ ను మలుపు తిప్పింది. ఆ సినిమా విజయంతో ఆమె హిట్ ట్రాక్ ఎక్కింది. అప్పటి వరకు కేవలం గ్లామర్ బొమ్మగా చూసిన వారు, ఆమెలోని నటనను గుర్తించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు.

రాజమాత శివగామిగా విశ్వరూపం..

రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో దర్శకధీరుడు రాజమౌళి చెక్కిన శిల్పం ‘శివగామి’. ‘బాహుబలి’ సినిమాలో ఆమె పోషించిన రాజమాత పాత్ర సినిమాకే ప్రాణం పోసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది. ఈ సినిమాతో రమ్యకృష్ణ పేరు దేశవిదేశాల్లో మారుమోగిపోయింది. ఆ తర్వాత రజనీకాంత్ తో ‘జైలర్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటిస్తూ తన హవా కొనసాగిస్తోంది.

ప్రస్తుతం రమ్యకృష్ణ మోస్ట్ డిమాండెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతోంది. సమాచారం ప్రకారం, ఆమె ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల నుండి రూ. 4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. ఆమె నికర ఆస్తుల విలువ సుమారు రూ. 98 కోట్లుగా ఉంటుందని అంచనా. ఒకప్పుడు ఫ్లాపులతో కుంగిపోయిన ఒక నటి, తన పట్టుదలతో ఇంతటి ఎత్తుకు ఎదగడం నిజంగా అభినందనీయం. “ఓపిక ఉంటే విజయం వరిస్తుంది” అనే మాట రమ్యకృష్ణ విషయంలో అక్షరాల నిజమైంది. ఐరన్ లెగ్ అన్న వారే నేడు ఆమె కాల్ షీట్స్ కోసం క్యూ కడుతున్నారు.