AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజమౌళితో సినిమా ఎందుకు చేయలేదు? ముక్కుసూటిగా అసలు విషయాన్ని చెప్పిన ఎడిటర్

సినిమా ఎడిటింగ్ టేబుల్ వద్ద మార్తాండ్ కె. వెంకటేష్ గారిని చూస్తుంటే ఒక రకమైన నిశ్శబ్దం, ఏకాగ్రత కనిపిస్తాయి. వేల కిలోమీటర్ల ఫిల్మ్ రీల్స్ నుంచి, నేటి డిజిటల్ ఫుటేజ్ వరకు ఆయన ప్రయాణం అద్భుతం. ఒక కథను ఎలా చెబితే ప్రజలు మెచ్చుకుంటారో ఆయనకు తెలిసినట్లుగా..

రాజమౌళితో సినిమా ఎందుకు చేయలేదు? ముక్కుసూటిగా అసలు విషయాన్ని చెప్పిన ఎడిటర్
Editor Marthand K Venkatesh
Ravi Kiran
|

Updated on: May 13, 2026 | 11:34 AM

Share

తమ అభిమాన హీరో తెరపై కనిపిస్తే ఈలలు వేసే ప్రేక్షకులు, ఆ సినిమా వెనుక ఎడిటర్ పడే కష్టం గురించి పెద్దగా ఆలోచించరు. కానీ, ఒక సినిమా విజయంలో ఎడిటింగ్ అనేది వెన్నెముక లాంటిది. టాలీవుడ్ లెజెండరీ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా మేకింగ్ గురించి, తన వ్యక్తిగత నిర్ణయాల గురించి పంచుకున్న విశేషాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రాజమౌళి లాంటి అగ్ర దర్శకులతో ఎందుకు పని చేయలేదనే విషయంపై ఆయన స్పష్టత ఇచ్చారు.

“నేను ఎవరికీ ఫోన్ చేసి అవకాశాలు అడగను. ఆ అవసరం నాకు ఎప్పుడూ కలగలేదు” అని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఎవరైనా డైరెక్టర్ తనను పిలిస్తే తప్పకుండా చేస్తానని, కానీ స్వయంగా వెళ్లి అడగడం తన గౌరవానికి విరుద్ధమని ఆయన భావిస్తానని చెప్పుకొచ్చారు. రాజమౌళితో సినిమా ఎందుకు చేయలేదన్న ప్రశ్నకు కూడా ఇదే సమాధానం ఇచ్చారు. ఆయనకు తనకంటూ ఒక టీమ్ ఉందని, తనకు రాజమౌళితో వ్యక్తిగత పరిచయం కూడా లేదని తెలిపారు.

వెంకటేష్ దృష్టిలో ఎడిటింగ్ అంటే కేవలం షాట్స్ కట్ చేయడం కాదు, అది తుది స్క్రీన్ ప్లే రాయడం వంటిది. షూట్ చేసిన ఫుటేజ్‌ని ఎలా పేర్చితే ఆడియన్ హుక్ అవుతారో నిర్ణయించేది ఎడిటరే అని ఆయన బలంగా నమ్ముతారు. సినిమా మొదటి పది నిమిషాల్లోనే ఆ కథ దేని గురించి అనేది ప్రేక్షకుడికి అర్థం కావాలని, లేదంటే వారు డిస్‌కనెక్ట్ అవుతారని ఆయన తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘వెంకీ’ సినిమాలోని ఐకానిక్ ట్రైన్ సీన్ గురించి మాట్లాడుతూ.. ఆ సీన్ ఎంత లెంత్ ఉన్నా ఎక్కడా బోర్ కొట్టదని, అందుకే తాము ఒక్క ఫ్రేమ్ కూడా తగ్గించలేదని చెప్పారు.

ఒక ఎడిటర్‌గా సినిమా ఫైనల్ అవుట్‌పుట్ చూశాక, ఫలితం ఎలా ఉంటుందో ఆయన ముందే ఊహిస్తారట. ఒకవేళ సినిమా సరిగ్గా రాకపోతే, డైరెక్టర్‌తో “మీరు వెంటనే మరో సినిమా చూసుకోండి, ఇది ఆడకపోవచ్చు” అని ముందే చెప్పేస్తారట మార్తాండ్ కె వెంకటేష్. అదే నిర్మాతకైతే “సినిమాను వెంటనే అమ్మేసి సేఫ్ అవ్వండి” అని సలహా ఇస్తారట. ఈ ముక్కుసూటితనం వల్లే ఆయన ఇండస్ట్రీలో ఇన్నేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్నానని చెప్పారు. అరుంధతి లాంటి క్లాసిక్ సినిమాలకు ఆయన చేసిన మ్యాజిక్ ఇప్పటికీ ఒక కేస్ స్టడీగా మిగిలిపోతుంది. సినిమా నిడివి ముఖ్యం కాదు, అందులో ఉండే ఎమోషన్, ఎంగేజ్మెంట్ ముఖ్యం అనేది ఆయన మాటల సారాంశం.

Follow Us