
తెలుగు చిత్రసీమలో సూపర్ స్టార్ కృష్ణ చేసినన్ని సాహసాలు, ఆయన చేసిన ప్రయోగాలు ఎవ్వరు చేయలేదు అని చెప్పడం ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన తన కెరీర్ లో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ తో కలిసి పని చేశారు కృష్ణ. అలాగే ఒకే హీరోయిన్ తో పదుల సంఖ్యలో సినిమాలు చేసి రికార్డ్ క్రియేట్ చేశారు కృష్ణ. అయితే కృష్ణ , అలనాటి స్టార్ హీరోయిన్ వాణిశ్రీల మధ్య కొనసాగిన విచిత్రమైన బంధం ఎందరినో ఆశ్చర్యానికి గురిచేసింది. దాదాపు 20కి పైగా చిత్రాలలో కలిసి నటించిన ఈ ఇద్దరూ, ఏనాడూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదని, కనీసం సెట్‌లో హాయ్, బాయ్ కూడా చెప్పుకునేవారు కాదని వాణిశ్రీ స్వయంగా వెల్లడించారు. దీని వెనుక కారణం ఏమిటన్నది ఒక పెద్ద సస్పెన్స్ ఉంది. పరిశ్రమలో కృష్ణను బోళా మనిషిగా, లోపల ఏదీ ఉంచుకోకుండా మొహం మీదే అనేసే వ్యక్తి అని అందరూ చెప్తుంటారు. ఆయనతో పనిచేసిన అనేక మంది ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూల్లోనూ తెలిపారు. ఏ గొడవలైనా అప్పటికప్పుడు పరిష్కరించే స్వభావం ఆయనదని చెబుతారు.
అయితే, వాణిశ్రీ విషయంలో మాత్రం ఆయన పూర్తి భిన్నంగా వ్యవహరించారు. ఎలాంటి మనస్పర్థలు, భేదాభిప్రాయాలు లేకపోయినా, తన కెరీర్ పొడవునా ఆమెను దూరం పెట్టారట కృష్ణ. వాణిశ్రీ, సావిత్రి తర్వాత తెలుగు సినిమాను శాసించిన నటీమణులలో వాణి శ్రీ ఒకరు. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు వంటి అగ్ర హీరోలందరితోనూ ఆమె పదుల సంఖ్యలో సినిమాలు చేశారు. అద్భుతమైన నటి కావడంతో ఆమె కోసం అప్పట్లో స్టార్స్ కూడా వేచి ఉండేవారు. కృష్ణ-వాణిశ్రీల కాంబినేషన్లో మహాబలుడు, మరుపురాని కథ, కన్నె మనసులు, జగత్ కిలాడీలు, చీకటి వెలుగులు, స్త్రీ జన్మ, అసాధ్యుడు, పచ్చని సంసారం వంటి 20కి పైగా చిత్రాలు వచ్చాయి. అప్పట్లో ఈ జంటను అత్యంత సక్సెస్ ఫుల్ జోడీగా పిలిచేవారు. అయితే వాణిశ్రీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
తన నటనను ఎన్టీఆర్ ఎక్కువగా ప్రశంసించేవారని, అప్పుడప్పుడు కృష్ణంరాజు కూడా పొగిడేవారని తెలిపారు. కానీ ఏఎన్‌ఆర్, కృష్ణ మాత్రం ఎప్పుడూ బాగా చేశావని గానీ, బాగున్నావని గానీ అనలేదని ఆమె వెల్లడించారు. వయసు అంతరం కారణం కావచ్చు లేదా తాము చిన్న పిల్లలం అనుకుని ఉండవచ్చు, కారణం ఏదైనా తనను ఎవరూ అభినందించలేదని వాణిశ్రీ చెప్పారు. కృష్ణతో కలిసి ఎన్నో సినిమాలు చేసినా, దర్శకుడు షాట్ చెప్పినట్టు చేసేవాళ్ళం తప్ప, ఒకరినొకరు విష్ చేసుకోవడం కానీ, మాట్లాడుకోవడం కానీ జరగలేదని ఆమె స్పష్టం చేశారు. కేవలం వచ్చామా, షూటింగ్ చేశామా, వెళ్లిపోయామా అన్నట్లుగా తమ మధ్య వ్యవహారం సాగిందని వివరించారు. కృష్ణ చాలా మంచివారని, అందరినీ బాగా చూసుకుంటారని, తన సినిమాల కలెక్షన్ల లెక్కలు కూడా ఆయన మైండ్ లో ఉంటాయని, వ్యక్తిగా చాలా గొప్ప మనిషని వాణిశ్రీ ప్రశంసించారు. అయితే, తన విషయంలో మాత్రం ఆ దూరం ఎందుకు ఉండేదో అర్థం కాలేదని తెలిపారు. ఈ మౌనం దాదాపు 30 ఏళ్ల పాటు కొనసాగింది. ఒకానొక సందర్భంలో, 30 ఏళ్ల తర్వాత కృష్ణ వాణిశ్రీకి ఫోన్ చేసి ఒక సినిమాలో నటించమని అడిగారట. ఆ సినిమాలో ఆమె సవతి తల్లిగా నటించాలని, ఆ పాత్ర చివర్లో హీరోకు విషం ఇచ్చి చంపుతుందని కృష్ణ వివరించారట. వాణిశ్రీ ఆ సినిమా కథ విన్న తర్వాత, అలాంటి ప్రతికూల పాత్ర తనకు వద్దని, ఆ మూవీ చేయలేనని కృష్ణకు మొహం మీదే స్పష్టం చేశారు. కృష్ణ మూడు నాలుగుసార్లు అడిగినా, వాణిశ్రీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదట. అలా కృష్ణతో తాను మాట్లాడుకుంది ఆ ఒక్కసారేనని, అది తప్ప మరెప్పుడూ మాట్లాడలేదని వాణిశ్రీ వెల్లడించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.