
తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన అగ్నిపర్వతం చిత్రం ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోయింది. 1985 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా, కృష్ణ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. సినీ విశ్లేషకులు చిలకగట్టు శ్రీకాంత్ ఈ చిత్రం విశేషాలను పంచుకుంటూ, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ కమర్షియల్ డ్రామాకు అగ్నిపర్వతం కొత్త నిర్వచనం ఇచ్చిందని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, కృష్ణ ద్విపాత్రాభినయానికి వేదికైంది. అగ్ని, జమదగ్ని అనే రెండు శక్తివంతమైన పాత్రలలో కృష్ణ కనిపించారు. ముఖ్యంగా, జమదగ్ని పాత్ర సృష్టి వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అశ్వినిదత్ కోరిక మేరకు, పరిచూరి వెంకటేశ్వరరావు సౌత్ ఆఫ్రికాలో రాఘవేంద్రరావుతో కథ చర్చించడానికి వెళ్లారు. అక్కడ, పరిచూరి గోపాలకృష్ణ పౌరాణిక కథాంశాల నుంచి శ్రీహర్షుడి కథను ప్రేరణగా తీసుకొని, తల్లి తన శక్తిని కుమారుడికి ధారపోసే అంశాన్ని వివరించారు. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని, తల్లిపై పడిన నింద, కుమారుడి ప్రతీకారంతో జమదగ్ని పాత్రను పరిచూరి వెంకటేశ్వరరావు తీర్చిదిద్దారు.
రాఘవేంద్రరావు మొదట జమదగ్ని పాత్ర తీవ్రతను చూసి, తన సాధారణ వినోదాత్మక శైలికి ఇది సరిపోదని భావించినప్పుడు, వినోద అంశాన్ని జోడించడానికి కృష్ణకు మరో పాత్ర, చిలిపి కృష్ణుడు అలియాస్ చంద్రం (గోపాలకృష్ణుడు) సృష్టించారు. దీంతో కృష్ణ గంభీరమైన జమదగ్నిగా, జాలీగా ఉండే చంద్రంగా ద్విపాత్రాభినయం చేశారు. “అగ్గిపెట్టి ఉందా..?”, “శివుడు మూడో కన్ను తెరిచినా, ఈ జమదగ్ని మూడో అంకె లెక్కపెట్టినా” వంటి డైలాగ్స్ అప్పట్లో యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. కృష్ణ కర్ర తిప్పే స్టైల్ అప్పట్లో ట్రెండ్‌గా మారింది. ఈ సినిమాలో తొలుత హీరోయిన్‌గా శ్రీదేవిని సంప్రదించారు. అయితే, కృష్ణ ద్విపాత్రాభినయం, రెండు హీరోయిన్ల ఉండటంతో తన పాత్రకు తగిన ప్రాధాన్యత ఉండదనే భావనతో ఆమె సున్నితంగా తిరస్కరించారట.
ఆతర్వాత విజయశాంతి, రాధ హీరోయిన్లుగా ఎంపికయ్యారు. రాధ పోషించిన లిల్లీ పాత్ర విశేషంగా ఆకట్టుకుంది. జగ్గయ్య, అన్నపూర్ణమ్మ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలలో నటించారు. అల్లు రామలింగయ్య కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు, అయితే చిత్రీకరణ మధ్యలో ఆయన అనారోగ్యంతో చెన్నైకి తిరిగి వెళ్లడంతో, ఆ పాత్రను నగేష్ కొనసాగించారు, అది ప్రేక్షకులు పెద్దగా గుర్తించలేనంత పకడ్బందీగా ఉంటుంది. రూ. 28 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఊటీలో 28 రోజులు షూటింగ్ జరుపుకుంది. అగ్నిపర్వతం కేవలం ఒక మాస్ ఎంటర్‌టైనర్‌గా మాత్రమే కాకుండా, బలమైన కుటుంబ బంధాలు, ప్రతీకారం వంటి అంశాలను చూపించింది. క్లైమాక్స్‌లో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు, ముఖ్యంగా తల్లి తాళిబొట్టుకు సంబంధించిన దృశ్యం మహిళా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. ఈ చిత్రంలోని జమదగ్ని పాత్ర ఎంతగా జనాల్లోకి వెళ్లిందంటే, ఆ పేరుతోనే భారతీరాజా దర్శకత్వంలో కృష్ణ హీరోగా మరో సినిమా కూడా వచ్చింది. అలాగే, అతడు చిత్రంలో చిన్న మహేష్ బాబు అగ్నిపర్వతం పోస్టర్ పక్కన పరుగెత్తుకు వచ్చే సన్నివేశం ఈ చిత్రం ప్రభావానికి నిదర్శనం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి