
బుల్లితెరపై యాంకర్ సుమకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తనదైన యాంకరింగ్‌తో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తుంది. ఇటీవలే సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా వెండితెర అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. క్షణం, కృష్ణ అండ్ హిస్ లీలా సినిమాల దర్శకుడు రవికాంత్ పేరేపు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో తెలుగమ్మాయి మానస చౌదరి కథానాయికగా నటించింది. ఈ సినిమా డిసెంబర్ 29న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి సినిమాతోనే తన నటనకు ప్రశంసలు అందుకున్నాడు రోషన్. అయితే ఈ సినిమాలో మరో పాత్ర హైలెట్ అయ్యింది. బబుల్ గమ్ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అతనెవరో తెలుసా ?.. చైతు జొన్నలగడ్డ. ఈ సినిమాలో రోషన్ కనకాల తండ్రిగా కనిపించాడు. ఈ సినిమాలో చికెన్ కొట్టి యాదగిరి పాత్రలో తన నటనతో అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నాడు.
చైతు జొన్నలగడ్డ.. టాలీవుడ్ యంగ్ హీరో డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డకు సొంత అన్నయ్య. పక్కా హైదరాబాదీ యాసలో చైతు జొన్నలగడ్డ స్లాంగ్ ఈ మూవీకి ప్లస్ అయ్యింది. ముఖ్యంగా తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. బిగ్ స్క్రీన్ పై చైతు జొన్నలగడ్డను చూడగానే సిద్ధు జొన్నలగడ్డ పోలీకలు కనిపిస్తాయి. చైతును స్క్రీన్ పై చూస్తున్నంతసేపు సిద్ధూను తెరపై చూసినట్లే ఉంటాయి. బబుల్ గమ్ సినిమా అతడికి ఫస్ట్ సినిమానే. అయినా ఎన్నో చిత్రాల్లో నటించిన నటుడిలా చేశారు. బబుల్ గమ్ సినిమాతో ఇప్పుడు చైతు జొన్నలగడ్డకు తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తుంది.
యాంకర్ సుమ కొడుకు నటించిన బబుల్ గమ్ సినిమాలో అతిథి పాత్రలలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం నటించారు. అలాగే సుమ తల్లి అంటే రోషన్ అమ్మమ్మ కూడా కనిపించింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు రోషన్. అలాగే నటనపరంగానూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు రోషన్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.