
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఉన్న ఫ్యాన్స్ బేస్ గురించి చెప్పక్కర్లేదు. అందం.. అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రేమమ్ సినిమాతో మలయాళీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తొలి చిత్రానికే భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. కేవలం హీరోయిన్ అంటే గ్లామర్ కాదు.. రోల్ కూడా ఇంపార్టెంట్ అంటుంది ఈ కేరళ కుట్టి. హీరోలకు సమానంగా ఓరేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ ఆమెనే. కంటెంట్.. పాత్ర ప్రాధాన్యతను చూస్తూ నెమ్మదిగా సినిమాలు చేస్తూ అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తెలుగు అడియన్స్ ఆమెను లేడీ పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. నటనతోపాటు.. డాన్స్ కూడా ఎంతో అద్భుతంగా చేసి ఆకట్టుకుంటుంది సాయి పల్లవి. విరాట పర్వం, గార్గి చిత్రాల తర్వాత చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంది.
ప్రస్తుతం ఆమె తండేల్ సినిమాలో నటిస్తుంది. డైరెక్టర్ చందూ మొండేటీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో యువ సామ్రాట్ నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల రూపొందించిన లవ్ స్టోరీ తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇదే. దీంతో తండేల్ సినిమాపై మరింత క్యూరియాసిటీని నెలకొంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. మరోసారి సాయి పల్లవి, చైతూ పెయిర్ బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సాయి పల్లవికి ఇండస్ట్రీలో స్నేహితులు చాలా తక్కువగా ఉన్నారు. అది కూడా తెలుగు సినీ పరిశ్రమలో తనకు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారని.. స్నేహితులు అని చెప్పడం కంటే ఫ్యామిలీ అంటే బాగుంటుందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తనకు ఏ కష్టం వచ్చినా ఆ ముగ్గురు తన వెన్నెంటే ఉంటారని తెలిపింది. ఇంతకీ టాలీవుడ్ ఇండస్ట్రీలో సాయి పల్లవి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే.. హీరో నాగ చైతన్య.. రానా దగ్గుబాటి.. ఆ తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల. వీరు ముగ్గురు తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అని.. తనకు అన్ని సమయాల్లో వీరు ముగ్గురు తోడుగా ఉంటారని చెప్పుకొచ్చింది. స్నేహితులు అనడం కంటే తామంతా ఒక ఫ్యామిలీలాగా ఉంటామని తెలిపింది. ప్రస్తుతం సాయి పల్లవి ఓల్డ్ ఇంటర్వ్యూ వీడియో నెట్టింట వైరలవుతుంది.
డైరెక్టర్ శేఖర్ కమ్ముల ద్వారానే తెలుగు తెరకు పరిచయమైంది సాయి పల్లవి. ఆయన తెరకెక్కిచిన ఫిదా సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది ఈ కేరళ కుట్టి. ఆ తర్వాత ఆయన డైరెక్షన్లో లవ్ స్టోరీ సినిమాలో నాగ చైతన్యతో కలిసి నటించింది. ఈ మూవీలో సాయి పల్లవి, చైతూ కెమిస్ట్రీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. వీరిద్దరి జోడిగా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.. ఇక రానా, సాయి పల్లవి కాంబోలో వచ్చిన విరాట పర్వం మూవీ మంచి రివ్యూస్ అందుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.