కేజీఎఫ్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించిన సినిమా. కన్నడ హీరో యష్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో అటు యష్.. ఇటు నీల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కేజీఎఫ్ తర్వాత సెకండ్ పార్ట్‌తో మరోసారి రచ్చ చేశాడు నీల్. ఇందులో యష్ తన అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకున్నాడు. పోస్ట్-పాండమిక్ ప్రపంచంలో కొత్త రికార్డులను స్కోర్ చేసింది. కేజీఎఫ్ 1,2 తర్వాత ఇప్పుడు కేజీఎఫ్ 3 కోసం అడియన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు నీల్ తెరకెక్కిస్తోన్న సలార్ సినిమాకు కేజీఎఫ్ 3కి లింక్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ సలార్ చిత్రం సరికొత్త కంటెంట్ అంటూ గతంలోనే క్లారిటీ ఇచ్చేశారు డైరెక్టర్ నీల్. ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో రాబోయే సినిమాకు కేజీఎఫ్ చిత్రానికి లింక్ ఉంటుందని రూమర్స్ వినిపించాయి. తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చాడు నీల్. ఇటీవల ప్రముఖ ఆంగ్ల పత్రిక పింక్ విల్లాతో ముచ్చటించిన నీల్.. జూనియర్ ఎన్టీఆర్ మూవీ, కేజీఎఫ్ 3పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. “ కేజీఎఫ్ 3 సినిమా ఉంటుంది. నేను దర్శకుడో కాదో నాకు తెలియదు కానీ యష్ ఎప్పుడూ అందులో భాగమవుతాడు. ఇప్పటికీ మేము కేజీఎఫ్ 3 సినిమాను ప్రకటించలేదు. కానీ ఇప్పటికే స్క్రిప్ట్ రెడీగా ఉంది. ప్రకటన చేయడానికి ముందే స్క్రిప్ట్‌పై నిర్ణయం తీసుకున్నాం. యష్ చాలా బాధ్యతాయుతమైన వ్యక్తి. KGF 2 ముగింపులో అధికారిక ప్రకటన చేయడానికి ముందు మేము స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాం ” అంటూ చెప్పుకొచ్చాడు. కేజీఎఫ్ 3కి ముందు తారక్ సినిమా చేస్తామన్నారు.
అలాగే జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ గురించి స్పందిస్తూ.. “విభిన్నమైన భావోద్వేగాలతో కూడిన విభిన్నమైన చిత్రం ఇది. ఇప్పటివరకు నేను తీసిన సినిమాలకు ఇది పూర్తిగా భిన్నం. నేను జానర్‌లోకి వెళ్లాలని అనుకోను. కానీ ప్రజలు దీనిని యాక్షన్ చిత్రంగా భావిస్తారు. కానీ అది ఏ జానర్ అని చెప్పలేను. వచ్చే ఏడాది తారక్ సినిమాను స్టార్ట్ చేస్తాము.. ఆలాగే సలార్ సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ కానుంది.” అని అన్నాడు.
అలాగే “నేను అమితాబ్ బచ్చన్ సినిమాలు చూసి పెరిగాను. అందుకే ఆయనతో ఓ సినిమా చేయాలని ఉంది. నా సినిమాలో అమితాబ్ నటించడానికి అంగీకరించాలి’’ అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ పోస్ట్-ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.