Pawan Kalyan Hari Hara Veera Mallu Moive: అజ్ఞాతవాసి సినిమా తర్వాత ఎన్నికల సమయంలో కొంతకాలం సినిమాలకు గ్యాప్ తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ వరస సినిమాలతో బిజీ అయ్యారు. వకీల్ సాబ్ తర్వాత డిఫరెంట్ నేపధ్య సినిమాలను అంగీకరించిన పవన్ కళ్యాణ్ వరస సినిమాలను లైన్ లో పెట్టారు. ఇప్పటికే మలయాళం సూపర్ హిట్ సినిమా రీమేక్ లో పవన్ కళ్యాణ్ రానా లు కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాను ‘భీమ్లా నాయక్’ గా తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజైన టైటిల్ సాంగ్ ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ను అలరించింది. ఇక పవన్ కళ్యణ్ పుట్టినరోజున ఫ్యాన్స్ కు కానుకగా మరో సినిమా హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ తో ఈరోజు చిత్ర సమర్పకులు ఎ.ఎం. రత్నం, డైరెక్టర్ క్రిష్ లు చర్చలు జరిపారు దీంతో ఈ చిత్రం షూటింగ్ త్వరలో పునప్రారంభం కానుందని తెలుస్తోంది. ‘భీమ్లా నాయక్’ చిత్రం షూటింగ్ పూర్తవగానే “హరిహర వీరమల్లు” చిత్రం షూటింగ్ ప్రారంభించటానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా చిత్రీకరించ వలసిన సన్నివేశాలు, గీతాలు, పోరాట సన్నివేశాలు, షూటింగ్ ప్రదేశాలు, నిర్మించ వలసిన భారీ సెట్స్ వంటి విషయాల గురించి చిత్ర నిర్మాత, దర్శకుల మధ్య సమాలోచనలు జరిగాయి. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ దాదాపు యాభై శాతం పూర్తయింది.
మిగిలిన భాగాన్ని నిరవధికంగా షూటింగ్ జరిపి పూర్తిచేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్ర నిర్మాత ఎ.దయాకర్ రావు తెలియచేశారు. “హరిహర వీరమల్లు” 2022 ఏప్రిల్ 29 న రిలీజ్ కానున్నదని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని చిత్ర నిర్మాణ కార్యక్రమాలు త్వరిత గతిన జరిగేలా ప్రణాళిక సిద్ధం చేశారు. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో జరిగే కథ కావడంతో, అత్యద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా ఈ”హరిహర వీరమల్లు” సినిమా ను రూపొందిస్తున్నారు దర్శకుడు క్రిష్. పాన్-ఇండియా స్థాయిలో నిర్మాణమవుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు.
పవన్ కళ్యాణ్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ని మాగ్నమ్ ఓపస్ ఫిల్మ్ నిర్మిస్తుంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా.. జ్ఞానశేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాకు మాటలను అందిస్తున్నారు.