సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) వరుస సినిమాలతో బిజీగా ఉన్నపటికీ. అప్పుడప్పుడు తన వాయిస్‌ను ఇతర సినిమాల్లో వినిపిస్తూ ఉంటారు. ఇప్పటికే మహేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే.. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమాలో కూడా మహేష్ తన వాయిస్ ను వినిపించారు. ఆ మధ్య యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన సినిమాకు కూడా మహేష్ వాయిస్ ఇచ్చారు. ఇక ఇప్పుడు మెగాస్టార్ సినిమా కోసం మహేష్ మాట సాయం చేయనున్నారు. మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య. సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆచార్య సినిమా ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేశాయి.
ఇక ఈ మూవీ మహేష్ వాయిస్ ఓవర్ పై దర్శకుడు కొరటాల శివ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆచార్య సినిమాలో ధర్మస్థలి గ్రామం చాలా కీలకం.. ఆ గ్రామానికి ఒక కథ ఉంటుంది. అక్కడ అమ్మవారు ఎలా వెలిసింది. ఆ గ్రామం ఎలా ఆవిర్భవించింది అనేది వివరించడానికి ఓ హానెస్ట్ వాయిస్ కావాలి అనిపించింది. అందుకోసం మహేష్ బాబును అడగ్గానే వెంటనే ఒప్పుకున్నారు. కథ చెప్తాను వింటారా అని అడగ్గా అవసరం లేదు నేను చెప్పేస్తాను అని ఆయన వాయిస్ ఇచ్చారు. ఆయన వాయిస్ వింటే.. ఆయన చెప్పిన విధానం మనల్ని ఆ ధర్మస్థలి ప్రాంతానికి తీసుకెళ్తుంది. అంత అద్భుతంగా చెప్పారు అని కొరటాల శివ చెప్పుకొచ్చారు. మహేష్ వాయిస్ తోనే ఆచార్య సినిమా మొదలవనుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఇక ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ నెల 23న హైదరాబాద్ లో జరగనుంది.