దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్ పై సాయిబాబ కోవెల మూడి, వెంకట్ కోవెల మూడి నిర్మిస్తున్న చిత్రం వాంటెడ్ పండుగాడ్. ఇందులో సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తుండగా.. శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గోన్న డైరెక్టర్ రాఘవేంద్రరావు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘ఎంటర్‌టైన్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం. జనార్ధన మహర్షి కథ నాకు వినిపించారు. హిలేరియస్‌గా అనిపించింది. నిజానికి తనికెళ్ల భరణిగారు ఈ సినిమాను డైరెక్ట్ చేద్దామని అనుకున్నారు. పెళ్లి సందD సినిమాకు శ్రీధర్ సీపాన అద్భుతమైన డైలాగ్స్‌ను అందించాడు. దాంతో తనే వాంటెడ్ పండుగాడ్ సినిమాను డైరెక్ట్ చేస్తే బావుంటుందనిపించింది. పి.ఆర్ సంగీతం, మహి సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎసెట్‌గా నిలుస్తుంది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్. వీళ్లందరితో కలిసి పనిచేయడం వల్ల నాకు వయసు గుర్తుకు రాదు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ చక్కగా సపోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్. జూన్ చివరి వారం లేదా జూలై తొలి వారంలో ఈ సినిమా రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.
సునీల్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో పండు పాత్రలో నటించాను. ప్రేక్షకులను నవ్వించే సినిమా. ఫ్యామిలీ అంతా తెగ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.