
దర్శకుడు బోయపాటి శ్రీను ఓ కార్యక్రమంలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితం, నిర్మాతల బంధాలపై విస్తృతంగా మాట్లాడారు. తన తొలి చిత్రం ‘భద్ర’తో దర్శకుడిగా పరిచయమయ్యే సమయంలో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడినట్లు వెల్లడించారు. చిత్ర నిర్మాణ సమయంలో ఎలాంటి పారితోషికం లేకుండా, కేవలం నెలవారీ ఖర్చుల కోసం రూ.40,000 మాత్రమే తీసుకున్నానని తెలిపారు. సినిమా పూర్తయిన తర్వాత రూ.5 లక్షల ప్యాకేజీని (ఒక ఫోర్డ్ ఐకాన్ కారుతో కలిపి) నిర్మాత దిల్ రాజు అందించినట్లు ఆయన వివరించారు. ‘భద్ర’ చిత్రం విజయం సాధించినప్పటికీ, తనకు మిగిలింది కేవలం రూ.1.5 లక్షలు మాత్రమేనని, ఆ తర్వాత మళ్లీ అప్పులు చేయాల్సి వచ్చిందని బోయపాటి పేర్కొన్నారు. దిల్ రాజుతో తనకున్న బంధం గురించి మాట్లాడుతూ, ‘భద్ర’ రీమేక్ రైట్స్ విషయంలో తాను ఎలాంటి హక్కులు డిమాండ్ చేయలేదని తెలిపారు. కొత్త దర్శకుడిగా అవకాశాన్ని ఇచ్చినందుకు, ఆ రోజుల్లో అడిగి ఉంటే దిల్ రాజు రైట్స్ ఇచ్చి ఉండేవారని, కానీ తన పట్ల దిల్ రాజు మాటలను గౌరవించి ఎలాంటి డిమాండ్లు చేయలేదని అన్నారు.
తన రెండవ చిత్రం ‘తులసి’ (2007)కు నిర్మాత సురేష్ బాబు రూ.50 లక్షల పారితోషికం ఇచ్చారని, అది అప్పట్లో చాలా ఎక్కువ అని బోయపాటి వెల్లడించారు. అయితే, సినిమా నాణ్యత కోసం తన పారితోషికంలో కొంత తగ్గించుకున్నానని తెలిపారు. ‘సింహా’ చిత్రం విషయంలోనూ తక్కువ పారితోషికమే తీసుకున్నానని, కానీ తన టీమ్ సభ్యులకు మంచి పారితోషికం అందాలని, సినిమా ఖర్చుల విషయంలో రాజీ పడకూడదని నిర్మాతలకు స్పష్టం చేసినట్లు చెప్పారు. ‘సింహా’ భారీ విజయం సాధించిన తర్వాత కూడా తన రెమ్యూనరేషన్‌లో అదనంగా ఏమీ ఇవ్వలేదని, అయితే నిర్మాత పరుచూరి ప్రసాద్ తన ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని రూ.20 లక్షలు అదనంగా ఇచ్చినట్లు బోయపాటి గుర్తు చేసుకున్నారు.
తన తండ్రి గురించి మాట్లాడుతూ, తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడే ఆయన మరణించారని, తన డైరెక్టర్ కావాలనే కలను ఆయన చూడలేకపోయారని భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రే తనలో పట్టుదలను, లక్ష్యాన్ని నింపారని, ఆయన లేని లోటు తీర్చలేనిదని బోయపాటి శ్రీను అన్నారు. తన తండ్రి బలహీనతలకు సరైన చికిత్స అందక ఎలా మరణించారో వివరించారు. దర్శకుడిగా తన శైలి గురించి మాట్లాడుతూ, తన గురువు ముత్యాల సుబ్బయ్య నుంచి నాటకీయతను నేర్చుకున్నప్పటికీ, తన చిత్రాలలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు, మానవ సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.
Also Read: బస్సు డ్రైవర్ కొడుకు.. పేద కుటుంబం.. కట్ చేస్తే.. ట్రిపుల్ హ్యాట్రిక్ విజయాల డైరెక్టర్