
అతి చిన్న వయసులోనే చనిపోయిన నటీనటులు చాలా మంది ఉన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నూ చాలా మంది అతి చిన్న వయసులోనే ఈ లోకం విడిచి వెళ్లిపోయారు. ‘ఈశ్వర్’ సినిమా నటుడు పొట్టి రాంబాబు కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతారు. ప్రభాస్ హీరోగా పరిచయమైన ఈ సినిమాలో హీరో మిత్ర బృందంలో పనసకాయ పట్టుకుని తిరిగే క్యారెక్టర్‌లో తూర్పు గోదావరి యాసతో రాంబాబు చక్కని హాస్యాన్ని పండించాడు రాంబాబు. దీని తర్వాత అతనికి సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ‘చంటిగాడు’, ‘దొంగ -దొంగది’, ‘కథానాయకుడు’, ‘దొంగల బండి’, ‘ అస్త్రం’, ‘గోపి-గోపిక-గోదావరి’ ఇలా దాదాపు 40కి పైగా చిత్రాల్లో నటించి నవ్వించారు పొట్టి రాంబాబు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన రాంబాబుకు చిన్నప్పటి నుంచి నాటకాలంటే బాగా ఇష్టం. చిన్నతనంలోనే తన తండ్రి చనిపోవడంతో తల్లి సంరక్షణలోనే పెరిగిన ఆయన చుట్టు పక్కల గ్రామాల్లో నాటకాలు బాగా వేసేవారు. ముఖ్యంగా ఎక్కడ నాటకం వేసినా పొట్టి వ్యక్తి చేసే పాత్ర మాత్రం కచ్చితంగా రాంబాబు చేసేవారు. ఒకసారి హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఓ నాటకం వేశారు. ఆ నాటకంలో రాంబాబు నటనను నటుడు విజయచందర్ మెచ్చుకున్నారు. సినిమాల్లో అవకాశాలు వస్తాయని అప్పట్లోనే ఆయన అన్నారు. అందుకు తగ్గట్టుగానే 2002లో ప్రభాస్ చిత్రం ‘ఈశ్వర్’లో తొలిసారిగా నటించారు రాంబాబు. ఆ తర్వాత కూడా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి నవ్వించారు.
సుమారు 40కు పైగా సినిమాల్లో నటించిన పొట్టి రాంబాబు కేవలం 35 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. 2015 డిసెంబర్ ఆయన కన్నుమూశారు. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూనే రాంబాబు తుది శ్వాస విడిచారు. రాంబాబుకు భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. కాగా ఆస్పత్రి బిల్లు చెల్లించడానికి కానీ, చివరకు అంబులెన్స్‌కు చెల్లించడానికి కానీ డబ్బులు లేని పరిస్థితుల్లో రాంబాబు కన్ను మూయడం మరో విషాదం. అప్పటి ‘మా’ అధ్య క్షుడు రాజేంద్రప్రసాద్, లక్ష్మీ మంచు, శివాజీ రాజా, కాదంబరి కిరణ్ తదితరులు రాంబాబు కుటుంబానికి ఆర్థికసాయం చేశారు.
అయితే రాంబాబు మరణానికి కారణం ఆయన చెడుఅలవాట్లేనని ఈశ్వర్ సినిమాకు పని చేసిన ఒకరు చెప్పుకొచ్చారు. ఈశ్వర్ సినిమా తర్వాత రాంబాబు రోజుకు రూ.15వేల పారితోషికం తీసుకున్నారని కానీ కొన్ని చెడు అలవాట్లు ఆయనను బలిగొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.