
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గ వెలుగొందుతోన్న చాలామంది ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులు పడిన వారే. పొట్ట కూటి కోసం రెక్కలు ముక్కలు చేసుకున్న వారే. కుటుంబాన్ని పోషించడం కోసం చిన్నా చితకా పనులు చేసిన వారు కూడా ఉన్నారు. ఇక ఈ టాలీవుడ్ నటునిది అయితే మరీ దారుణమైన పరిస్థితి. ఇప్పడంటే ఈ నటుని పేరు మీద కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. కానీ ఒకప్పుడు ఆయన ముంబైలోని ఒక చిన్న గదిలో జీవితం గిపాడు. ఉద్యోగం లేకపోవడంతో ఇంట్లోనే ప్లేట్లు, గిన్నెలు కడిగారు. భార్య కు వచ్చే జీతంలోనే తన అవసరాలు కూడా తీర్చుకునేవాడు. అయితే ఎన్ని కష్టాలొచ్చినా నటన పట్ల ఆసక్తిని వదులుకోలేదు. అదే అతనిని ఇప్పుడు పెద్ద స్టార్ ను చేసింది. కోట్లాది రూపాయల ఆస్తులకు యజమానిగా మార్చేసింది. ప్రస్తుతం ఇండియాలోనే ది బెస్ట్ యాక్టర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఆ నటుడు మరెవరో కాదు మీర్జాపూర్ ఫేమ్ పంకజ్ త్రిపాఠి.
పలు హిందీ సినిమాలో పాటు తెలుగులో ‘దూసుకెళ్తా’ అనే సినిమాలోనూ నటించాడు పంకజ్ త్రిపాఠి. ప్రస్తుతం బాలీవుడ్‌లో నటునిగా బిజీ బిజీగా ఉంటోన్న పంకజ్ చేతిలో పెద్ద సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. అయితే ఒకప్పుడు ఆయన ముంబైలోని ఒక చిన్న గదిలో ఉన్నారు. సినిమా అవకాశాల కోసం ముంబై అంతటా తిరిగాడు. ఆ సమయంలో ఇంటి ఖర్చులన్నీ ఆయన భార్య మృదుల త్రిపాఠి జీతంతోనే గడిచేవి. ముంబైకి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల పాటు పంకజ్ త్రిపాఠికి సినిమాల్లో పెద్ద అవకాశాలు రాలేదు. నిరంతరం ఆడిషన్ల కోసం తిరుగుతూ, తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ, అతను తన నటనా కలను వదులుకోలేదు. మృదుల ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, ఆమె జీతం ఇంటి ఖర్చులకు సరిపోయేది. మరోవైపు, పంకజ్ వంట, గిన్నెలు కడగడం, శుభ్రపరచడం వంటి ఇతర ఇంటి పనులను చూసుకునేవాడు. కుటుంబంలో ఒకరికొకరు సహకరించుకోవడం వల్లే తాము కష్టకాలాలను అధిగమించగలిగామని వారిద్దరూ అనేక ఇంటర్వ్యూలలో చెబుతారు.
ఒక ఇంటర్వ్యూలో పంకజ్ త్రిపాఠి మాట్లాడుతూ, 2004 నుంచి 2010 మధ్య తన ఆదాయం చాలా తక్కువగా ఉండేదని చెప్పారు. చేతిలో ఉద్యోగం లేకపోవడం వల్ల ఆయన తరచుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో, ఆయన భార్య సంపాదన కుటుంబానికి ప్రధాన వనరుగా ఉండేది. ఇంట్లో బాధ్యతలు పంచుకోవడంలో ఎలాంటి సమస్యలు రాలేదని, పైగా ఒకరికొకరు తోడుగా ఉంటూనే కుటుంబం ముందుకు సాగుతుందని కూడా ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.
పంకజ్ త్రిపాఠి ప్రస్తుతం ముంబైలో విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నప్పటికీ, ఆయన తన ఇంట్లో మంచం, మట్టి పాత్రల వంటి పల్లెటూరి వస్తువులను వాడుతారు. అలాగే బీహార్‌లోని తన పూర్వీకుల ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మీడియా నివేదికల ప్రకారం, పంకజ్ త్రిపాఠి నికర ఆస్తి విలువ సుమారు రూ. 40 కోట్లు. ఆయన ఒక సినిమాకు రూ. 3 నుంచి 4 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.