
ఒకప్పుడు ఊపేసిన టీవీ షోల్లో జబర్దస్త్ ఒకటి.. సినిమాలకు మించిన క్రేజ్ సొంతం చేసుకుంది జబర్దస్త్. ఈ షో ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. ఎంతో మంది కమెడియన్స్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అలాగే కొందరు హీరోలు, దర్శకులుగానూ రాణిస్తున్నారు. ఒకప్పుడు జబర్దస్త్ కు ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు అనే చెప్పాలి. చాలా మంది పాత టీమ్ మెంబర్స్ ఇప్పుడు లేరు. దాంతో క్రేజ్ మెల్లగా తగ్గిపోయింది. ఇక జబర్దస్త్ లో చాలా మంది నవ్వులు పూయించారు. వారిలో మహిధర్ ఒకడు. జబర్దస్త్ లో కొన్ని స్కిట్స్ చేసిన మహిధర్.. ఆ తర్వాత జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేశాడు.
ఓ ఇంటర్వ్యూలో మహిధర్ మాట్లాడుతూ.. టీమ్ లీడర్ అయిన తర్వాత కమెడియన్ జీవన్ ఏర్పాటు చేసిన పార్టీలు, షూటింగ్ రోజు నాన్ వెజ్ భోజనాలు వంటి వాటిని ప్రస్తావిస్తూ, కొన్నిసార్లు అనవసరమైన భజన చేయాలి, కొన్నిసార్లు అది కేవలం ఫార్మాలిటీ అని తెలిపాడు మహిధర్. జబర్దస్త్ షో పడిపోవడానికి, పాత ఆర్టిస్టులు వెళ్లిపోవడం, ప్రేక్షకులు ఇప్పుడు ఒక ఫిక్స్డ్ టైంకి టీవీ చూడటానికి ఆసక్తి చూపకపోవడం, ఓటీటీ, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్ చూడటానికి ఇష్టపడుతుండటం, అలాగే కామెడీ రిపీట్ అవ్వడం వల్ల జబర్దస్త్ క్రేజ్ పడిపోయిందని మహిధర్ చెప్పుకొచ్చాడు.
అలాగే మహిధర్ మాట్లాడుతూ.. జబర్దస్త్ రీ యూనియన్ కు కూడా తనను పిలవలేదని, దీనిపై తాను గతంలో ఒక వీడియో కూడా చేశానని తెలిపాడు. జబర్దస్త్ లో తన ప్రయాణం గురించి మాట్లాడుతూ, 2016లో ఫైజర్ ఫార్మా కంపెనీలో ఉద్యోగం మానేసి ఈ రంగంలోకి వచ్చానని తెలిపాడు. తన తండ్రి మరణం తర్వాత తల్లి పడిన కష్టాల వల్ల ఉద్యోగం సంపాదించానని, అయితే తన ముక్కుసూటి స్వభావం వల్ల అక్కడ సమస్యలు ఎదుర్కొన్నానని వివరించారు. అంతే కాదు తన ముక్కుసూటితనం ఇండస్ట్రీలో జీవితాన్ని దెబ్బతీసిందని, అయితే అదే తనను ఆర్.పి. అన్నకు నచ్చేలా చేసిందని మహిధర్ అన్నాడు. జబర్దస్త్ లో రైటర్లకు, ఆర్టిస్టులకు ప్రాధాన్యత ఇవ్వకుండా మేనేజర్లకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, ఇలాంటి పర్సనల్ ఇంట్రెస్టులు, ఫేవరిజం షోలో ఉండేవని, తన దృష్టికి కూడా కొన్ని విషయాలు వచ్చాయని మహిధర్ తెలిపాడు. తాను ఇండస్ట్రీలోకి వచ్చింది కేవలం జబర్దస్త్ కోసమేనని, టీమ్ లీడర్ అవ్వాలనే తన లక్ష్యాన్ని సాధించానని.. 18 స్కిట్లు చేశానని, తన లక్ష్యం నెరవేరిందని, ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల జబర్దస్త్ నుండి తప్పుకోవాల్సి వచ్చిందని తెలిపాడు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..