Godfather vs The Ghost: దసరాకు ట్రయాంగిల్ వార్.. చిరంజీవి, నాగార్జున మధ్యలోకి మరో హీరో..

|

Aug 24, 2022 | 3:51 PM

Godfather vs The Ghost: టాలీవుడ్‌లో సంక్రాంతి, సమ్మర్ తర్వాత అందరి చూపు ఉండేది దసరా సీజన్‌పైనే. 10 రోజులకి పైగా హాలీడేస్ ఉంటాయి కాబట్టి చాలా మంది హీరోలు ఆ సీజన్‌లో తమ మూవీస్‌తో రావాలనుకుంటారు.

Godfather vs The Ghost: దసరాకు ట్రయాంగిల్ వార్.. చిరంజీవి, నాగార్జున మధ్యలోకి మరో హీరో..
Chiranjeevi, Nagarjuna
Follow us on

టాలీవుడ్‌లో సంక్రాంతి, సమ్మర్ తర్వాత అందరి చూపు ఉండేది దసరా సీజన్‌పైనే. 10 రోజులకి పైగా హాలీడేస్ ఉంటాయి కాబట్టి చాలా మంది హీరోలు ఆ సీజన్‌లో తమ మూవీస్‌తో రావాలనుకుంటారు. ఈ సారి కూడా అదే జరుగుతోంది.అక్టోబర్‌లో రాబోయే దసరా సీజన్‌కు ఇప్పట్నుంచే ఖర్చీఫ్ వేస్తున్నారు మన హీరోలు. పైగా ఇద్దరు స్టార్ హీరోలు ఒకేరోజు బాక్సాఫీస్ బరిలో దిగనున్నారు. అందులో చిరంజీవి ఒకరు.. నాగార్జున రెండో స్టార్ హీరో. మరో హీరో కూడా రేసులో నిలవబోతున్నారు.

దసరా రోజే గాడ్ ఫాదర్(Godfather) సినిమాతో చిరంజీవి వస్తున్నారు. అక్టోబర్ 5న తన సినిమా విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు మెగాస్టార్. మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, నయనతార కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మూడేళ్ళ కింద సైరా సినిమాను కూడా దసరా సీజన్‌లోనే మెగాస్టార్ తీసుకొచ్చారు. ఆ సినిమా 2019, అక్టోబర్ 2న విడుదలైంది.

చిరంజీవితో పాటు అక్కినేని నాగార్జున(Nagarjuna) కూడా దసరాకే వస్తున్నారు. ఈయన నటిస్తున్న ది ఘోస్ట్ (The Ghost) మూవీ అక్టోబర్ 5నే రానుంది. ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నాగార్జున స్పైగా నటిస్తున్నారు. గరుడవేగ తర్వాత ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న సినిమా ది ఘోస్ట్. చిరుతో పాటు నాగార్జున కూడా దసరా పండక్కే థియేటర్స్‌లోకి వస్తుండటంతో.. ఈ ఇద్దరు ఇండస్ట్రీ ఫ్రెండ్స్ మధ్య  సమరం బాక్సాఫీస్ దగ్గర ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చిరు, నాగార్జున సినిమాలు ఒకేరోజు విడుదల కాలేదు. గతంలో స్టాలిన్-బాస్.. సంకీర్తన-ఆరాధన.. విక్రమ్-వేట.. దొంగ మొగుడు-మజ్ను లాంటి సినిమాలు వారం వ్యవధిలో విడుదలయ్యాయి. కానీ ఒకేరోజు మాత్రం పోటీ పడలేదు చిరంజీవి, నాగార్జున. 2022 దసరాకు తొలిసారి గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలతో వారిద్దరు బాక్సాఫీస్ దగ్గర పోటీకి సై అంటున్నారు.

చిరంజీవి, నాగార్జునతో పాటు ఈ సారి దసరాకు మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా వస్తున్నారు. ఈయన నటిస్తున్న జిన్నా సినిమా సైతం అదే రోజు విడుదల కానున్నట్లు ఇదివరకే ప్రకటించారు మేకర్స్. కోన వెంకట్ కథ అందిస్తున్న ఈ చిత్రాన్ని ఇషాన్ సూర్య తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ సగానికి పూర్తైంది. మొత్తానికి దసరా పండక్కి చిరు, నాగార్జున, విష్ణు మధ్య త్రిముఖ పోరు జరగబోతుందన్నమాట.

(ప్రవీణ్ కుమార్, టీవీ9 ET)

మరిన్ని సినిమా వార్తలు చదవండి