AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ పాటకు నా రెమ్యూనరేషన్ రూ.25 వేలు.. కానీ రాయల్టీ ద్వారా లక్షలు వచ్చాయ్..

ప్రపంచ స్థాయిలో తెలుగు పాటకు గుర్తింపు తెచ్చిన గేయ రచయిత చంద్రబోస్, గేయ రచయితల హక్కులు, రాయల్టీల ప్రాధాన్యంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఒక పాట ఎంత ఎక్కువగా ప్రజల్లో వినిపిస్తే అంత ఎక్కువ రాయల్టీ వస్తుందని ఆయన చెప్పారు. ..

ఆ పాటకు నా రెమ్యూనరేషన్ రూ.25 వేలు.. కానీ రాయల్టీ ద్వారా లక్షలు వచ్చాయ్..
Chandrabose
Ram Naramaneni
|

Updated on: Jun 16, 2026 | 5:22 PM

Share

ప్రపంచ స్థాయిలో తెలుగు పాటకు గుర్తింపు తెచ్చిన గేయ రచయిత చంద్రబోస్. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ అందుకున్న ఆయన గేయ రచయితల హక్కులు, రాయల్టీల గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.

‘‘సినిమా ఇండస్ట్రీలో టాలెంట్‌కు మంచి గుర్తింపు ఉంటుంది. గేయ రచయితలకు పారితోషికంతో పాటు, పాట హిట్‌ అయితే రాయల్టీ రూపంలో కూడా ఆదాయం వస్తుంది. ఈ రాయల్టీని ఇండియన్‌ ఫెర్మారింగ్ రైట్స్‌ సొసైటీ అందిస్తుంది. ఒక పాట ఎంత ఎక్కువ మంది వింటే, ఎంత ఎక్కువ వేదికల్లో వినిపిస్తే, అంత ఎక్కువ రాయల్టీ వస్తుంది.

ఉదాహరణకు ఒక పాటకు రూ.1 రాయల్టీ వస్తే, అందులో రచయితకు పావలా వంతు, సంగీత దర్శకుడికి పావలా వంతు, మిగతాది పబ్లిషింగ్‌ సంస్థకు వెళ్తుంది. నా కెరీర్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన పాటల్లో ఆవారా చిత్రంలోని ‘చిరు చిరు చినుకై కురిశావే’ ఒకటి. ఆ పాట రాసినప్పుడు నాకు రూ.25 వేల పారితోషికం ఇచ్చారు. కానీ ఇప్పటివరకు అదే పాట రాయల్టీ ద్వారా రూ.10 లక్షలకు పైగా సంపాదించి పెట్టింది. ఇంకా ఆదాయం వస్తూనే ఉంది. ఈ పాటకు ఒకేసారి రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు రాయల్టీ వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. కాగా ఇప్పటివరకు ఈ వీడియో సాంగ్‌కు యూట్యూబ్‌లో 135 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. బ్రహ్మాస్త్ర’ చిత్రంలోని ‘కుంకుమలా నువ్వే’ పాట కూడా అలాంటిదే’’ అని చంద్రబోస్ చెప్పారు.

అలాగే, ‘‘మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే అది ఎదుగుదలకు ఒక మెట్టుగా మారుతుంది. మంచి అనువాద గీతాలు రాసినా రాయల్టీ వస్తుంది. గత 10–15 ఏళ్లలో గేయ రచయితల పరిస్థితి చాలా మెరుగైంది. ఒకప్పుడు పాట సినిమా వరకే పరిమితమయ్యేది. ఇప్పుడు థియేటర్లు, టీవీలు, మొబైల్‌ ఫోన్లు, రేడియోలు, హోటళ్లు, రియాలిటీ షోలు, సోషల్‌ మీడియా ఇలా ఎన్నో వేదికల్లో పాటలు వినిపిస్తున్నాయి. అందుకే రచయితలకు నిరంతర ఆదాయం వస్తోంది’’ అని అన్నారు.

గేయ రచయితల హక్కుల కోసం ఎక్కువగా కృషి చేసిన వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి అని చంద్రబోస్ గుర్తుచేశారు. ‘‘రచయితలకు న్యాయం జరిగేలా ఆయన ఎంతో శ్రమించారు. చట్టాలను అధ్యయనం చేసి, నిపుణులతో చర్చించి, రచయితలకు ఉపయోగపడే విధంగా మార్గం చూపించారు. కరోనా సమయంలో సినిమా పనులు లేకపోయినా, రాయల్టీ రూపంలో రచయితలకు ఆర్థిక సహాయం అందింది. ఎంతో మంది యువ గేయ రచయితలకు అది అండగా నిలిచింది. ఈ వ్యవస్థ బలంగా కొనసాగాలంటే మంచి పాటలు పుడుతూనే ఉండాలి’’ అని చెప్పారు.

Follow Us