
తెలుగు సినీ పరిశ్రమలో కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు.. కంటెంట్ ముఖ్యమంటున్న హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. కథ బలంగా ఉంటే వైవిధ్యమైన పాత్రలు చేసేందుకు రెడీగా ఉంటుంది. మొదట్లో సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ లో నటించింది. స్టార్ హీరోస్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి నటనతో ఆకట్టుకుంటుంది. కానీ ఇప్పుడు వెండితెరపై కథానాయికగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ తెగ బిజీగా ఉంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టరా ? తనే హీరోయిన్ అమృత అయ్యార్. తెలుగులో పలు చిత్రాల్లో నటించి ప్రశంసలు అందుకున్న అందాల ముద్దుగుమ్మ. తెలుగుతోపాటు. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించి అలరించింది. బెంగుళూరులో 1994 మే 14న జన్మించింది అమృత. బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేసిన అమృత ఆ తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
మొదట్లో షార్ట్స్ ఫిల్మ్స్ చేసిన అమృత 2012లో మలయాళంలో విడుదలైన పద్మవ్యూహం సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా అమృత పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత 2018 లో తమిళంలో పదైవీరన్ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ వయ్యారి.. హీరోయిన్గా మొదటి సినిమాకే సైమా అవార్డ్ కు నామినేట్ అయ్యింది. ఇక తెలుగులో రెడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. కానీ ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. దీంతో తెలుగులో అమృతకు అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత తమిళంలో విజయ్ దళపతి నటించిన బిగిల్ చిత్రంలో కీలకపాత్ర పోషించింది. ఇందులో విజయ్ టీంలో క్రీడాకారిణిగా కనిపించింది.
ఆ తర్వాత యాంకర్ ప్రదీప్ నటించిన 30 రోజుల్లో ప్రేమించటం ఎలా సినిమాతో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇందులో అమృత నటనతో ఆకట్టుకుంది. తర్వాత అర్జున ఫల్గుణ చిత్రంలో కనిపించింది. ఇటీవలే యంగ్ హీరో తేజ సజ్జా నటించిన హనుమాన్ చిత్రంలో నటించింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ సెకండ్ పార్ట్ జై హనుమాన్ లోనూ అమృత కనిపించనున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.