
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇటీవల ఒక కార్యక్రమంలో తన తండ్రి హరి ఓం భాటియాను గుర్తు చేసుకున్నారు. అక్షయ్ తండ్రి 2000 సంవత్సరంలో ప్రొస్టేట్ క్యాన్సర్ తో మరణించారు. దీనిని మరోసారి గుర్తుచేసుకున్న అక్షయ్ పురుషులు ప్రతి సంవత్సరం ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ (PSA) పరీక్ష చేయించుకోవాలని కోరారు. తన తండ్రిని కోల్పోవడం వెనుక ఉన్న అతిపెద్ద కారణం 50-55 సంవత్సరాల తర్వాత PSA పరీక్ష ప్రాముఖ్యత గురించి తనకు తెలియకపోవడమేనని ఆయన ఎమోషనల్ అయ్యారు. ఈ పరీక్ష ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నిర్ధారించడంలో సహాయపడుతుందని అక్షయ్ సూచించాడు. ‘ కొన్నేళ్ల క్రితం నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అయిన మా నాన్నను కోల్పోయాను. ఆయన 67 సంవత్సరాల వయసులో మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆయన నాకు జీవితాన్ని అందించారు. కానీ ఆ సమయంలో సాధారణ వైద్య పరీక్షలు, స్క్రీనింగ్ టెస్టులు, వాటి ప్రాముఖ్యత గురించి మాకు పెద్దగా తెలియదు. ముఖ్యంగా 50-55 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరూ PSA పరీక్ష చేయించుకోవడం ముఖ్యమని నాకు తెలియదు. ఇక్కడ ఉన్న వారందరూ, అలాగే టీవీ ల్లో నా మాట వింటున్న పురుషులందరూ ప్రోస్టేట్ సీరియస్‌గా తీసుకోవాలని నేను కోరుతున్నాను’
ప్రతి సంవత్సరం PSA పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. ప్రారంభ దశలోనే వ్యాధి నిర్ధారణ అయితే, చికిత్స ప్రాణాలను కాపాడుతుంది. కాబట్టి, దయచేసి అందరు పురుషులు PSA పరీక్ష చేయించుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. ప్రోస్టేట్ క్యాన్సర్ సర్వసాధారణమైంది. ప్రతి ముగ్గురిలో ఒక్కరికి ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి, సకాలంలో రోగ నిర్ధారణ చేయడం చాలా ముఖ్యం. ఇది మీ ప్రాణాలను కాపాడుతుంది. మీ ప్రాణాలను మాత్రమే కాదు, మీ మొత్తం కుటుంబ సభ్యుల ప్రాణాలను కూడా కాపాడుతుంది’ అని అక్షయ్ తన అభిమానులకు సూచించారు. ప్రస్తుతం ఈ హీరో కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
PSA పరీక్ష అంటే ఏమిటి?
ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్(PSA) అనేది ప్రోస్టేట్ కణాల ద్వారా ఉత్పత్తి అయ్యే ప్రోటీన్. PSA రక్త పరీక్ష మీ రక్తంలో PSA మొత్తాన్ని కొలుస్తుంది. ఈ టెస్ట్ ప్రధానంగా ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నిర్ధారించడానికి ఉపయోగించబడుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.