GV Babu: మూత్రపిండాల సమస్యతో మంచం పట్టిన బలగం నటుడు.. సాయం కోసం ఎదురుచూపు

జబర్దస్త్ ఫేమ్ వేణు యెల్దండి తెరకెక్కించిన బలగం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో సినిమా తారలతో పాటు ఎంతో మంది జానపద, రంగస్థల కళాకారులు నటించారు. అందులో బాబు అలియాస్ జీవీ బాబు కూడా ఒకరు.

GV Babu: మూత్రపిండాల సమస్యతో మంచం పట్టిన బలగం నటుడు.. సాయం కోసం ఎదురుచూపు
Balagam Actor GV Babu

Updated on: May 21, 2025 | 1:04 PM

బలగం సినిమాలో భాగమైన నటీనటులందరికీ మంచి పేరు వచ్చింది. సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. బలగం సినిమాలో కొమురయ్య పాత్రలో అద్భుతంగా నటించిన సుధాకర్ ఇప్పుడు పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. అయితే ఇదే సినిమాలో కొముయ్య తమ్ముడు అంజన్న పాత్రలో నటించిన జీవీ బాబు మాత్రం అవకాశాల్లేక అనారోగ్యంతో మంచం పట్టాడు. ప్రస్తుతం ఆయన మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్నారు. వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బాబుకు చికిత్స అందిస్తున్నారు. అలాగే తరచూ డయాలసిస్ చేయిస్తున్నారు. అయితే వైద్యం చేయించడానికి, మందుల కొనుగోలుకు ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బాబు కుటుంబ సభ్యులు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జీవీ బాబుకు మెరుగైన వైద్యం అందించాలని, దాతలు, కళాకారులు ఆర్థికసాయం అందించేందుకు ముందుకు రావాలని తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం కోరారు.

కాగా బలగం సినిమాతో పేరు వచ్చినా కూడా ఆ పెద్దగా డబ్బు అలాగే అవకాశాలు రాలేదని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
వరంగల్‌ జిల్లా రామన్నపేటకు చెందిన బాబు రంగస్థల కళాకారుడు. బలగం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో అంజన్నగా అద్భుతంగా నటించి ఆడియెన్స్ తో కన్నీళ్లు పెట్టించారు. అయితే బలగం తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు బాబు. దీంతో కుటుంబం ఆర్థిక సమస్యల బారిన పడింది. ఇప్పుడు బాబు కూడా అనారోగ్యంతో మంచాన పడ్డారు. ప్రభుత్వం, దాతలు సానుకూలంగా స్పందించి బాబుకు వైద్యం కోసం ఆర్థిక సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

కాగా గతంలో బలగం సినిమా నటుడు మొగిలయ్యకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే.. ప్రభుత్వంతో పాటు కేటీఆర్, మెగాస్టార్ చిరంజీవి లాంటి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆదుకున్నారు.  వైద్య ఖర్చులకు తమకు తోచినంత ఆర్థిక సాయం చేశారు.  ప్రస్తుతం బాబు పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎవరైనా సహాయం చేయకపోరా? అని దీన స్థితిలో ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.