
నందమూరి తారకరత్న ఈ లోకం నుంచి వెళ్లిపోయి మూడేళ్లు గడిచిపోయాయి. 2023 ఫిబ్రవరిలో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. తారకరత్న మరణంతో ఆయన భార్య అలేఖ్యా పూర్తిగా కుంగిపోయింది. ఈ విషాదం నుంచి బయటపడడానికి చాలా రోజులే పట్టింది. నిత్యం తారకరత్నను గుర్తు తెచ్చుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు షేర్ చేస్తోంది. అలాగే తన పిల్లల పెంపకంతోనే బిజీగా ఉంటోంది. ఇదిలా ఉంటే తారకరత్న మరణం తర్వాత అలేఖ్య బయట కనిపించిన దాఖలాలు చాలా తక్కువ. ఎలాంటి ఫంక్షన్లు, కార్యక్రమాల్లోనూ కనిపించడం లేదామె. ఈ క్రమంలో తారకరత్న మరణం తర్వాత మొదటి సారి ఓ ఇంటర్వ్యూకు హాజరైంది అలేఖ్య. తారకరత్నతో పరిచయం, ప్రేమ, పెళ్లి తదితర విషయాలపై ఓపెన్ గా మాట్లాడింది. అలాగే భర్త మరణం తర్వాత తాను, తన పిల్లలు పడుతున్న ఇబ్బందులను తల్చుకుంటూ ఎమోషనల్ అయ్యింది.
‘ నేను తారక్‌ను తొలుత హైదరాబాద్ లోనే కలిసాను. ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. ఆయన అందర్నీ మన అని కలుపుకొనేవారు. అప్పటికే నేను విడాకులు తీసుకున్నాను. అసలు మళ్లీ పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. కానీ తారక్ నన్ను కన్విన్స్ చేసాడు. నాన్నకు ఆయన ముందే తెలుసు. దీంతో తననే వచ్చి మా అమ్మానాన్నలతో మాట్లాడమన్నాను. ముందు ఒప్పుకోకపోయినా ఒక నెలరోజులకు మా పేరెంట్స్ ఒకే అన్నారు. అయితే తారక్ వాళ్ల సైడ్ ఒప్పుకోలేదు. నేను మా మామయ్య , అత్తమ్మ అని యాక్సెప్ట్ చేశాను. కానీ వాళ్లు ఇంకా నన్ను యాక్సెప్ట్ చేయలేదు. పెద్ద వాళ్లు కదా అలాగే ఉంటుంది. నా మీద కోపం ఉంటుంది.
‘ నేను చాలా సార్లు వాళ్లకు దగ్గరవ్వాలని ప్రయత్నించాను. నేను వారి విషయంలో చాలా పాజిటివ్ గానే ఉన్నాను. కానీ నేను ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో ఎవరితోనూ కాంటాక్ట్ లో లేను. ఒకప్పుడు కళ్యాణ్ అన్న మంచి ఫ్రెండ్ లా ఉండే వాడు. ఒక్క బాల బాబాయ్ మాత్రం ఉన్నారు మా కోసం. ఆయనకు మా ఇన్ఫర్మేషన్ అంతా వెళ్తుంది. నాకున్నదాంట్లో నేను పిల్లలని బాగా పెంచగలను కానీ తారక్ అమ్మానాన్నలు కూడా పిల్లలను దగ్గరకు తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు నా జీవితంలో అదొక్కటే కోరిక’ అని చెప్తూ ఎమోషనల్ అయింది అలేఖ్య. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. అభిమానులు తారక రత్న భార్యకు ధైర్యం చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.