Ala Vaikunthapurramuloo : ఒకప్పడు మామూలు ఆకెళ్ల నాగ శ్రీనివాస్ శర్మ..కానీ ఇప్పుడు మాటల మాంత్రికుడు, గురూజి. తెలుగు చిత్రసీమలో సాలిడ్ సినిమాలు తీస్తూ తనదైన ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు త్రివిక్రమ్. ముఖ్యంగా ఆయన సినిమాలోని సంభాషణలు..ఆడియెన్స్‌ను నిజ జీవితంలో కూడా వెంటాడుతూ ఉంటాయి. సినిమా చూస్తున్నప్పుడే లేచి నిల్చోని చప్పట్లు కొట్టాలనిపించే డైలాగ్స్ త్రివిక్రమ్ మూవీలో కోకొల్లలు ఉంటాయ్. ఇటీవల ‘అరవింద సమేత వీరరాఘవ’ , ‘అల వైకుంఠపురం’ చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ విజయాలు అందుకున్నాడు ఈ ఏస్ డైరెక్టర్. ముఖ్యంగా ‘అల వైకుంఠపురం’ 200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇప్పటికి కొన్ని ప్రాంతాలలో సినిమా కలెక్షన్లు బాగున్నాయి.
అయితే ఈ మూవీ కథ విషయంలో త్రివిక్రమ్‌కు ఊహించని చిక్కొచ్చిపడింది. ‘అల వైకుంఠపురం’ కథ తనదే అంటూ కృష్ణ అనే ఓ యువ రచయిత మీడియా ముందుకు వచ్చాడు. తాను 2005లో చెప్పిన కథతో త్రివిక్రమ్ సినిమాను తెరకెక్కించాడని ఆరోపిస్తున్నాడు. 2013లో సదరు కథను అతడు ఫిల్మ్ ఛాంబర్‌లో కూడా రిజిస్టర్ చేయించాడట. గౌరవించే వ్యక్తిగా తన స్కిప్ట్ ఫస్ట్ కాపీని త్రివిక్రమ్ చేతిలో పెడితే, ఆయన తన కథనే సినిమాగా తీశారని అతడు వాపోతున్నాడు. దశ-దిశ అనే పేరుతో మూవీని తెరకెక్కించాలనుకున్నానని, కాని త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ చిత్రం రూపొందించాడని అంటున్నాడు. త్వరలోనే త్రివిక్రమ్‌కి లీగల్ నోటీసులు కూడా పంపిస్తానని చెబుతున్నాడు కృష్ణ .
అయితే సినిమా రిలీజైన ఇన్ని రోజులకు అది నీ కథ అని తెలిసిందా అంటూ కృష్ణపై త్రివిక్రమ్ అభిమానులు ఫైరవుతున్నారు. కేవలం మీడియాలో కనిపించడానికే ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడని కొట్టి పారేస్తున్నారు. కాగా గతంలో ‘అజ్ఞాతవాసి’ తీసిన సమయంలో లార్గో వించ్ దర్శకుడి నుంచి విమర్శలు అందుకున్న త్రివిక్రమ్..’అ..ఆ’ సినిమా కథ విషయంలోనూ ఇబ్బందులు పడ్డారు.