Meena: నా భర్త పరిస్థితి మరెవరికీ రాకూడదంటూ గొప్ప నిర్ణయం తీసుకున్న మీనా.. శభాష్‌ అంటోన్న నెటిజన్లు

ప్రముఖ సీనియర్‌ నటి మీనా (Meena) భర్త విద్యాసాగర్‌ (Vidyasagar) కొన్ని రోజుల క్రితం కన్నుమూసిన సంగతి తెలిసిందే. పోస్ట్‌ కొవిడ్‌ సమస్యలతో బాధపడిన ఆయన కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. దీంతో మీనా కుటుంబంతో పాటు సినిమా పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

Meena: నా భర్త పరిస్థితి మరెవరికీ రాకూడదంటూ గొప్ప నిర్ణయం తీసుకున్న మీనా.. శభాష్‌ అంటోన్న నెటిజన్లు
Meena

Updated on: Aug 14, 2022 | 5:33 PM

ప్రముఖ సీనియర్‌ నటి మీనా (Meena) భర్త విద్యాసాగర్‌ (Vidyasagar) కొన్ని రోజుల క్రితం కన్నుమూసిన సంగతి తెలిసిందే. పోస్ట్‌ కొవిడ్‌ సమస్యలతో బాధపడిన ఆయన కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. దీంతో మీనా కుటుంబంతో పాటు సినిమా పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇప్పుడిప్పుడే ఈ విషాదం నుంచి కోలుకుంటున్న ఆమె సినిమా షూటింగ్స్‌కి హాజరవుతోంది. రంభ, సంఘవి లాంటి సీనియర్‌ హీరోయిన్లు కూడా మీనా ఇంటికెళ్లి ఆమెను పరామర్శించారు. ఇటీవల నట కిరీటీ రాజేంద్ర ప్రసాద్‌ పుట్టినరోజు వేడుకల్లోనూ సందడి చేసింది. ఇదిలా ఉంటే తాజాగా మీనా గొప్ప నిర్ణయం తీసుకుంది. తన మరణానంతరం అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రకటించి అందరి చేత శభాష్‌ అనిపించుకుంటోంది. వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే (ఆగస్ట్‌ 13)ను పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నానని, మీరు కూడా ఈ గొప్ప నిర్ణయాన్ని తీసుకోండంటూ సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది మీనా.

కాగా లంగ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీ చేస్తే మీనా భర్త విద్యాసాగర్‌ బతికేవాడు. అయితే సమయానికి దాతలు దొరక్కపోవడంతో ఆయన మృతి చెందారు. ఈ కారణంగానే మీనా తన అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రకటించింది. ‘ప్రాణాలను కాపాడడం కంటే గొప్ప పని మరొకటి ఉండదు. అవయవాలను దానం చేయడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి, అవసరమైనవారికి అవయవాలు దానం చేయడం వల్ల వారి కుటుంబంలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయో నేను కళ్లారా చూశాను. మా సాగర్‌కు దాతలు దొరికి ఉంటే నా జీవితం మరోలా ఉండేది. ఒక దాత 8 మంది ప్రాణాలను కాపాడొచ్చట. అవయవ దానం గొప్పదనం గురించి అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. అవయవ దానం అనేది కేవలం వైద్యులు, రోగుల మధ్య సంబంధం కాదు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలా అందరికీ సంబంధించింది. నేను నా ఆర్గాన్స్‌ను డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నాను’ అని ఎమోషనల్‌గా రాసుకొచ్చింది మీనా. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మీనా నిర్ణయాన్ని అభినందిస్తూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..