
తులసి బాలనటిగా వెండి తెరపై అడుగు పెట్టింది. శంకరాభరణం సినిమాలో మంజుల కూతురుగా శంకర శాస్త్రి శిష్యురాలిగా తులసి నటన ఇప్పటికీ సినీ అభిమానుల మనసులో ముద్రించుకుంది. తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసినా కాలక్రమంలో చెల్లెలు, అక్క, వదిన, అమ్మ వంటి క్యారెక్టర్లకు షిప్ట్ అయ్యింది. ఏ పాత్ర అయినా సినీ ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటుంది. ఇటీవలే ఆమె సినిమాకు రిటైర్ మెంట్ తీసుకున్నారు. ఇక మిగిలిన జీవితాన్ని షిరిడి సాయినాధుని స్మరిస్తూ గడిపేస్తాను అని అనౌన్స్ చేశారు తులసి. కాగా గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
తులసి ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితం, ఆధ్యాత్మిక విశ్వాసాలపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ. ఆస్తుల కోసం ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదని, తన భర్త ఒక బీదవాడని, అత్తగారు ఒక ఇంటి పని చేసేవారని తెలిపారు తులసి. తన కొడుకు సాయిని చక్కగా పెంచి, ఇప్పుడు డైరెక్టర్‌గా మార్గనిర్దేశం చేస్తున్నానని గర్వంగా చెప్పారు. తులసి తన జీవితంలో సాయిబాబా పాత్ర గురించి వివరించారు. తన కొడుకు పేరు సాయి అని, అతనికి సాయిబాబాతో ఉన్న అనుబంధం గురించి ప్రశ్నించగా.. బాబా తనకు “ఏడు జన్మలుగా నేనే నీ కొడుకు” అని చెప్పినట్లు తెలిపారు. ఈ మాటలను మొదట తన తాతయ్య తనకు చెప్పారని వివరించారు.
1990 ఏప్రిల్ 14న తన తమ్ముడు చనిపోయినప్పుడు, బాబా ఫోటోను విసిరేసి తిట్టానని, అప్పట్లో దేవుడిపై తనకు కోపం వచ్చిందని గుర్తుచేసుకున్నారు. అప్పుడు తన తాతయ్య బాబా తన తమ్ముడిని చంపలేదని, అలా అనవద్దని సర్దిచెప్పారని తెలిపారు. ఆ తర్వాత, ఒకరోజు తెల్లవారుజామున 3:30 గంటలకు కలలో బాబాను చూశానని, ఆయన తనను “మా” అని పిలుస్తూ, “నేనే నీ కొడుకుని, గత జన్మలో నువ్వు ఒక ఆవువి, బ్రాహ్మణుడి ఇంట్లో ఉండేదానివి, నీ పాలు తాగి బతికాను. నీ తమ్ముడి రూపంలో నీ కడుపున పుడతాను” అని చెప్పినట్లు తెలిపారు. బాబా చెప్పిన ఆరు సంవత్సరాల తర్వాత, అంటే 1996 ఫిబ్రవరి 11న, తన కొడుకు సాయి జన్మించాడని వివరించారు. జీవితంలో తనకు ఎదురైన ప్రతి ప్రశ్నకు బాబా, తన తాతయ్య ద్వారా మార్గదర్శనం లభించిందని, వారే తన రెండు కళ్ళు అని తులసి ఎమోషనల్ అయ్యారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.