Odela 2 Movie review: ఓదెల 2 మూవీ రివ్యూ.. తమన్నా సోలో హిట్ కొట్టిందా..?

2022లో ఆహాలో నేరుగా విడుదలైన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. అప్పట్లో ఓటిటిలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా ఓదెల 2 తెరకెక్కించారు సంపత్ నంది. దర్శకత్వం మాత్రమే చేయలేదు గానీ ఈ సినిమాకు కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే. పైగా తమన్నా రాకతో స్టార్ వ్యాల్యూ కూడా పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Odela 2 Movie review: ఓదెల 2 మూవీ రివ్యూ.. తమన్నా సోలో హిట్ కొట్టిందా..?
Odela 2

Edited By: Rajeev Rayala

Updated on: Apr 17, 2025 | 1:04 PM

మూవీ రివ్యూ: ఓదెల 2

నటీనటులు: తమన్నా భాటియా, వశిష్ట ఎన్ సింహా, హెబ్బా పటేల్, మురళీ శర్మ, దయానంద్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు

ఎడిటర్: అవినాష్

సినిమాటోగ్రఫీ: సౌందరరాజన్

సంగీతం: అజినీష్ లోక్‌నాథ్

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ: సంపత్ నంది

దర్శకుడు: అశోక్ తేజ

నిర్మాత: డి మధు

కథ:

ఓదెలలో తిరుపతి (వశిష్ట ఎన్ సింహా)ను అతడి భార్య రాధ (హెబ్బా పటేల్) చంపేసిన తర్వాత ఊరు అంతా పండగ చేసుకుంటుంది. తిరుపతి శవానికి పోస్ట్ మార్టమ్ చేసి ఊరికి తీసుకొస్తే.. కనీసం ఆత్మకు కూడా శాంతి కలగకూడదని సమాధి శిక్ష వేస్తారు ఊరు జనం. దాంతో చనిపోయిన తిరుపతి ఆత్మ అక్కడే ఘోషిస్తూ ఉంటుంది. తిరుపతి మరణం తర్వాత మళ్లీ ఆ ఊళ్ళో పెళ్లిళ్లు మొదలవుతాయి. అదే సమయంలో తిరుపతి ఆత్మ మళ్లీ బయటికి వస్తుంది. ఊళ్ళో కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయిలను శోభనం రోజే చంపేస్తుంటుంది. ఆ మరణాల ఘోషను తట్టుకోలేక జైల్లో ఉన్న రాధమ్మ దగ్గరికి ఉపాయం కోసం వెళ్తారు ఊరు జనం. అప్పుడు వాళ్లకు తన అక్క భైరవి (తమన్నా) గురించి చెప్తుంది. చిన్నప్పటి నుంచే నాగసాధువుగా మారిపోయి శివుడిలో ఏకం కావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది భైరవి. ఆమె ఓదెలలో అడుగు పెడుతుంది. మరి తన దైవశక్తితో దుష్టశక్తిని అంతం చేసిందా లేదా అనేది అసలు కథ..

కథనం:

ఓదెల రైల్వేస్టేషన్ సినిమా నేరుగా ఓటిటిలో విడుదల కావడంతో చాలా మందికి ఫస్ట్ పార్ట్ కథేంటో తెలియదు. ఓదెల అనే ఊళ్లో తిరుపతి ఉంటాడు.. ఆయన శోభనం జరుగుతున్న అమ్మాయిలను పాడు చేసి చంపేస్తుంటాడు. మరోవైపు రాధ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఊళ్లోనే ఉంటాడు. ఒకరోజు ఊళ్ళో హత్యలు చేసేది తన భర్తే అని తెలుసుకుని తిరుపతి తల నరికి చంపేస్తుంది రాధ. అలా ఫస్ట్ పార్ట్ అయిపోతుంది. సెకండ్ పార్ట్ సరిగ్గా తెగిన తల దగ్గర్నుంచే మొదలు పెట్టాడు సంపత్ నంది. తిరుపతి శవాన్ని ఊరికి తీసుకురావడం.. ఆయన చేసిన దారుణాలు చూసి ఆత్మకు శాంతి లేకుండా చేయాలని ఊరు జనం సమాధి శిక్ష వేయడంతో కథ మొదలవుతుంది. ఆసక్తికరంగానే ఈ సినిమాను మొదలు పెట్టాడు సంపత్ నంది. కానీ ఆ తర్వాత సినిమా అంతా అతలాకుతలం అయిపోయింది. దేవుడి మీద భారం వేయొచ్చు కానీ ఎప్పుడు.. మన పని మనం కరెక్ట్ గా చేసినప్పుడు..! అంతేకానీ గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే ఎలా..? ఓదెల 2 గురించి చెప్పాలంటే ఈ రెండు ముక్కలు చాలు. అనగనగా ఒక ఊరు.. అందులో ఒక పేతాత్మ.. వాళ్లను కాపాడడానికి వచ్చి ఒక దైవ శక్తి.. అమ్మోరు కాలం నుంచి ఇదే కథ.. చాలా సినిమాలలో అది వర్కౌట్ అయింది కూడా. ఇలాంటి కథ రాసుకున్నప్పుడు కథనం చాలా పకడ్బందీగా ఉండాలి. ఓదెల 2 విషయంలో అది మిస్ అయింది.. ఫస్ట్ 15 నిమిషాలు ఆసక్తికరంగా మొదలైన కథ.. ఆ తర్వాత చాలా చప్పగా సాగింది. ఎక్కడా ఏ ట్విస్టులు లేవు.. టర్నులు లేవు.. స్క్రీన్ ప్లే నెమ్మదిగా వెళ్లింది. ఇంటర్వెల్‌కు గానీ తమన్నా రాదు.. తమన్నా వచ్చాక గానీ కథ ముందుకు కదలదు. సినిమాలో చాలా సన్నివేశాలు అరుంధతిని గుర్తు చేస్తాయి.. క్లైమాక్స్ ఏమో హనుమాన్ సినిమాకు కాపీలా అనిపించింది. సినిమా అంతా ఏదేదో చేసి.. చివర్లో దేవుడిని చూపిస్తే అంతా మర్చిపోతారనుకుంటే పొరపాటే. దేవుడు, దెయ్యం కాన్సెప్ట్ తీసుకున్నపుడు చాలా వరకు థ్రిల్లింగ్ మూవెంట్స్ ఉండాలి.. కానీ అవేం లేకుండా సింపుల్‌గా కానిచ్చేసాడు సంపత్ నంది.

నటీనటులు:

తమన్నా తన వరకు బాగానే నటించింది. నాగ సాధువు పాత్రలో మ్యాగ్జిమమ్ మెప్పించడానికి ప్రయత్నించింది. వశిష్ట ఎన్ సింహా ప్రేతాత్మగా బాగానే చేసాడు.. అయితే డబ్బింగ్ సెట్ కాలేదు. హెబ్బా పటేల్ చిన్న పాత్రలో కనిపించింది. మురళీ శర్మ, నాగ మహేష్ ఇలా ఎవరికి వాళ్లు తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.

టెక్నికల్ టీం:

అజినీష్ లోక్‌నాథ్ సంగీతం బాగుంది. పాటలు అంత ఆకట్టుకోకపోయినా బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే బాగానే ఉంది. ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. సంపత్ నంది రైటింగ్ చాలా వీక్ అనిపించింది.. ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఇలాంటి కథతో సినిమా చేయాలంటే కథనం చాలా కీలకం. అందులో తడబడ్డాడు సంపత్ నంది. అశోక్ తేజ పేరుకు దర్శకుడు అయినా.. మొత్తం చేసిందంతా సంపత్ నందే. నిర్మాణ విలువలు బాగున్నాయి. కథకు తగ్గట్లు ఖర్చు చేసారు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా ఓదెల 2.. అంతా శివార్పణం..