గత కొద్దిరోజులుగా టాలీవుడ్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. విడాకుల ప్రకటన తర్వాత నెట్టింట్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ.. మోటివేషనల్ కోట్స్.. సినిమా అప్డేట్స్ షేర్ చేస్తుంది. భర్తతో విడిపోయిన అనంతరం ఆమె షేర్ చేసే ప్రతి పోస్ట్ పై నెటిజన్స్ తెగ ఆసక్తి చూపించారు. దీంతో ఆకస్మాత్తుగా సామ్ నెట్టింట్లో సైలెంట్ కావడంతో అనేక రూమర్స్ పుట్టుకొచ్చాయి. సామ్ అరుదైన స్క్రీన్ ప్రాబ్లమ్‌తో బాధపడుతుందని.. సినిమాలకు బ్రేక్ ఇచ్చి అమెరికాలో చికిత్స తీసుకునేందుకు త్వరలోనే వెళ్లనున్నట్లుగా వార్తలు హల్చల్ చేశాయి. దీంతో ఆమె ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడడం లేదంటూ సామ్ మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా శాకుంతలం మూవీ అప్డేట్స్లో మళ్లీ యాక్టివ్ అయ్యింది సమంత. కేవలం మూవీ అప్డేస్ మాత్రమే షేర్ చేస్తున్న సామ్.. తాజాగా తన ఇన్ స్టా బయో మార్చింది.
“మీ సామర్థ్యాలు ఏమైనా.. మీరు వాటిని పరిమితికి మించి మరింత విస్తరించాలి ” అంటూ రాసుకొచ్చింది సామ్. అయితే ఇప్పుడు ఆమె మార్చిన బయో గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. ప్రస్తుతం సామ్ తెలుగు, హిందీ మాత్రమే కాకుండా హాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమవుతుంది. ఫ్యామిలీ మ్యాన్ 2 మేకర్స్ రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న యాక్షన్ సిరీస్ సిటాడెల్లో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సిరీస్ అమెరికాలో షూటింగ్ జరగనుంది. ఇందులోని తన పాత్ర కోసం సామ్ చాలా కష్టపడుతుందని.. అందుకు తనను తాను పూర్తిగా సిద్ధం చేసుకుంటుందని.. ఇక అందుకోసమే తన బయోను ఇలా మార్చిందంటూ నెట్టింట టాక్ వినిపిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ద్వారా పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది సామ్.
అలాగే ప్రస్తుతం సమంత.. ఖుషి చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించగా.. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న యశోద, శాకుంతలం సినిమాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.