
సినిమాలతో బిజీ బిజీగా ఉండే స్టార్ నటి అనసూయ బోరుమని ఏడ్చేసింది. ఓ ప్రెస్ మీట్ కు వీడియో కాల్ ద్వారా హాజరైన ఆమె అందరి ముందు కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో అనసూయకు ఏమైందోనని చాలా మంది కంగారు పడ్డారు. అలాగే ఆమె అరోగ్యం బాగోలేదన్న కామెంట్స్ కూడా వినిపించాయి. తాజాగా వీటిపై క్లారిటీ ఇచ్చింది అనసూయ. సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది. ‘నిన్న జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో జూమ్ కాల్ ద్వారా మాట్లాడాను. ఆ సమయంలో నాకు లభించిన మద్దతు, సహకారం నన్నెంతో భావోద్వేగానికి గురి చేశాయి. అదే సమయంలో కొంతకాలంగా నేను శారీరకంగా అనారోగ్యంతో ఉండడంతో, ఆ బలహీన క్షణంలో నాకు కన్నీళ్లు ఆగలేదు. కానీ ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. నేను పూర్తిగా బాగున్నాను. నా ఆరోగ్య పరిస్థితిపై అనవసర ఆందోళనలు వద్దు. ఒక మహిళగా నా అభిప్రాయాన్ని, స్వేచ్ఛను వ్యక్తపరచినందుకే ఇలాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావడం బాధాకరం. అయినా ఇలాంటి అనుభవాల నుంచే నేను మరింత బలాన్ని పొందుతున్నా. నా వెనక నిలబడ్డ అద్బుతమైన, బలమైన మహిళల వల్ల నాకు అపారమైన ధైర్యం లభిస్తోంది. మనమంతా మనుషులమే.. మనిషిగా భావోద్వేగానికి లోనవ్వడంలో నాకు ఎలాంటి సిగ్గు లేదు’
‘అసలైన విషయం ఏమిటంటే.. ఎన్ని కష్టాలు వచ్చినా మళ్లీ లేచి నిలబడటమే మన నిజమైన బలం. కొంతమంది ఇతరుల బలహీనతలను ఆసరాగా చేసుకుని లాభపడాలని చూస్తారు. అది నా వ్యక్తిత్వాన్ని ఏమాత్రం ప్రభావితం చేయదు. ఎలక్ట్రానిక్ మీడియాలోని కొన్ని విభాగాలపై నాకు నమ్మకం తగ్గుతున్నా.. న్యాయ వ్యవస్థపై మాత్రం పూర్తి విశ్వాసం ఉంది. క్లిక్ బైట్ కథనాలు, ఊహాగానాలకు దూరంగా ఉండాలి. నిజాన్ని, మానవత్వాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. నిన్నటి ప్రెస్ మీట్‌లో నేను భౌతికంగా లేకపోయినప్పటికీ.. నా తరపున నిలబడి మద్దతుగా మాట్లాడిన ప్రతి ఒక్కరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. నా కోసం మీరు మాట్లాడిన మాటలే నాకు దక్కిన అతి గొప్ప విజయం. వృత్తిపరమైన ఎదుగుదల కంటే.. ఇలాంటి సంక్షోభ సమయాల్లో లభించే గౌరవం, తోడ్పాటు గొప్ప ఆస్తిగా భావిస్తున్నా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, వెలుగు నిండాలని కోరుకుంటున్నా’ అని తన పోస్టులో రాసుకొచ్చింది అనసూయ. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.