
సీనియర్ నటుడు ప్రసాద్ బాబు.. ఈ పేరు చెప్తే ప్రేక్షకులు పెద్దగా గుర్తుపట్టక పోవచ్చు కానీ ఆయనను చూస్తే మాత్రం ఓహో ఈయన అని టక్కున గుర్తుపడతారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. వివిధ సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆధునిక సీజీ, టెక్నాలజీ లేని ఆ రోజుల్లో నటన చాలా సహజంగా ఉండాలని, తన్నాలంటే నిజంగా తన్నాల్సిందేనని ఆయన గుర్తుచేసుకున్నారు. మనవూరి పాండవులు చిత్ర షూటింగ్‌లో జరిగిన ఒక సంఘటనను ప్రసాద్ బాబు వివరించారు.
ప్రసాద్ బాబు మాట్లాడుతూ.. దివంగత నటుడు రావు గోపాలరావు ఒక ముళ్ల కర్రతో కొట్టే సన్నివేశంలో, అది ఎంత వాస్తవంగా ఉందంటే, ప్రసాద్ బాబుకు ఒంటిపై వాతలు పడి, రక్తం కూడా వచ్చిందని తెలిపారు. అయితే, తాను భీముడి పాత్రలో ఉన్నందున దెబ్బ తగిలినట్టు బయటకు కనిపించకుండా ఉన్నాను అని చెప్పారు. ఆతర్వాత రావు గోపాలరావు ఆయన్ను అయ్యా కంట్రోల్ చేసుకోలేకపోయానయ్యా అని అడగడం, ప్రసాద్ బాబు కూడా ఓకే అయిపోయింది రా అని బదులివ్వడం ఆనాటి నటుల మధ్య ఉన్న అనుబంధాన్ని అలా ఉండేది అని అన్నారు.
ప్రసాద్ బాబు, రావు గోపాలరావుల కాంబినేషన్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయని, రీల్ లైఫ్‌లో ఆయనకు తండ్రిగా నటించిన రావు గోపాలరావుతో సరదాగా గడిపేవాడినని పేర్కొన్నారు. రావు గోపాలరావు నటనలో లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ అలాగే మాట్లాడేవారని, డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్ సహజంగా ఉండేవని ప్రసాద్ బాబు అన్నారు. నటన పట్ల ఆయనకున్న అంకితభావం, ఆయన గొప్పతనాన్ని ప్రశంసించారు ప్రసాద్ బాబు. ఆయన ఇంటి నుంచి తెచ్చిన తులసి రసం, పనస పండు గుజ్జు వంటివి సెట్‌లోని అందరికీ పంచేవారని, సూర్యకాంతమ్మ వంటి గొప్ప నటీమణులు కూడా తమ ఇంటి నుంచి బొబ్బట్లను తెచ్చి అందరికీ వడ్డించేవారని, అలాంటి ఆప్యాయత ఇప్పుడు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజుల్లో రోజుకు 300-400 రూపాయలు ఇచ్చేవారని, ఒక్కోసారి 500 డిమాండ్ చేసేవారని తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.