కోలీవుడ్ హీరో ధనుష్‌లో పాన్ ఇండియా రేంజ్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. తమిళంతోపాటు, తెలుగు, హిందీ భాషలలో పలు సినిమాల్లో నటిస్తూ సినీ ప్రియులకు దగ్గర్యయాడు ధనుష్. కొన్ని నెలల క్రితం సార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అక్కినేని నాగార్జున, రష్మిక మందన్నా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అంతకు ముందు నాగార్జున, ధనుష్ షూటింగ్‌కి హాజరయ్యేందుకు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ సమయంలో నాగార్జునను కలిసేందుకు ఎయిర్ పోర్టులోని ఓ షాప్‌లో పనిచేస్తున్న వికలాంగ అభిమాని ప్రయత్నించాడు. ఆ సమయంలో నాగ్ బాడీగార్డ్స్ అతడిని పక్కకు తోసేశారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ కాగా.. నాగార్జున తీరు నెటిజన్స్ మండిపడ్డారు. దీంతో ఆ అభిమానికి నాగార్జున క్షమాపణలు చెప్పారు.
ఇదిలా ఉంటే ధనుష్ బాడీగార్డ్ సైతం ఓ అభిమానితో దురుసుగా ప్రవర్తించాడు. ముంబైలోని జుహు బీచ్‌లో ప్రస్తుతం కుబేర షూటింగ్‌కి ధనుష్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే ధనుష్ బీచ్‌లో నడుచుకుంటూ వెళుతుండగా ఓ అభిమాని వీడియో తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో ధనుష్ బాడీగార్డ్ ఆ వ్యక్తిని పట్టుకుని తోసేశాడు. అక్కడున్న మరికొంత అభిమానులను కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో ధనుష్ ప్రవర్తనపై నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మొన్న నాగార్జున బాడీగార్డ్ సైతం అభిమానిని పక్కకు తోసేశాడు. ఇప్పుడు ధనుష్ బాడీగార్డ్ సైతం దురుసుగా ప్రవర్తించాడు. అయినా ధనుష్ ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయాడు అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై ధనుష్ కు మద్దతు తెలుపుతున్నారు ఫ్యాన్స్. షూటింగ్ లొకేషన్‌లో అభిమానులు గుమిగూడితే చిత్రయూనిట్ డిస్టర్బ్ అవుతుంది. అందుకే అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. దీనిని , సీరియస్‌గా తీసుకోవద్దని, ధనుష్‌పై విమర్శలు చేయవద్దని కొందరు అభిమానులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే..కుబేర సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.