
తండ్రి భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే మిస్టర్ పర్ఫెక్ట్‌గా పేరు తెచ్చుకున్న గొప్ప నటుడు. ఆయన సినిమాలంటేనే ఒక బ్రాండ్, ఒక బాక్సాఫీస్ సెన్సేషన్. మరి అలాంటి స్టార్ హీరో వారసుడిగా ఎంట్రీ ఇచ్చి, మొదటి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు కొట్టేసిన ఆ యువ నటుడు ఇప్పుడు తన మూడో ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈసారి ఆయనకు జంటగా నటిస్తున్నది మరెవరో కాదు.. తన నటనతో, సహజమైన అందంతో దక్షిణాది ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ‘నేచురల్ స్టార్’. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఒక స్వచ్ఛమైన ప్రేమకథ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అసలు ఈ సినిమా కథేంటి? ఈ జంటపై ఆ స్టార్ హీరో చేసిన వ్యాఖ్యలు ఏంటి?
Sai Pallavi & Zunaid
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ 2024లో ‘మహారాజ్’ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేశాడు. సోషల్ రిఫార్మర్ కర్సన్ దాస్ ముల్జీ పాత్రలో జునైద్ చూపిన పరిణతికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ఖుషీ కపూర్‌తో కలిసి ‘లవ్యాప’లో నటించి తన కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు. ఇప్పుడు జునైద్ తన తర్వాతి సినిమా ‘ఏక్ దిన్’లో సాయి పల్లవితో కలిసి నటిస్తున్నాడు.
ఈ సినిమా ద్వారా సాయి పల్లవి బాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న ఆమె, ఒక ప్యూర్ రొమాంటిక్ సబ్జెక్టుతో హిందీ ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ సినిమాపై అమీర్ ఖాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కీలక విషయాలు పంచుకున్నారు. “ఇది ఒక స్వచ్ఛమైన ప్రేమకథ. క్లాసిక్ రొమాన్స్ జానర్ లో ఉండే ఈ సినిమా కథ వినగానే నాకు బాగా నచ్చింది. నాకు ఇలాంటి మ్యాజికల్ లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం” అని అమీర్ తెలిపారు.
ఈ సినిమాలో సాయి పల్లవిని తీసుకోవడంపై అమీర్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశారు. “సాయి పల్లవి అద్భుతమైన నటి. ఆమె ఈ సినిమాలో చాలా బాగా నటించింది. ఇక జునైద్ విషయానికి వస్తే, వాడు నా కొడుకు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడకూడదు కానీ, ఇద్దరూ కలిసి చాలా మంచి అవుట్ పుట్ ఇచ్చారు. దర్శకుడు సునీల్ పాండే ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు” అని అమీర్ ఖాన్ కొనియాడారు.
Ameer Khan1
ఈ సినిమా 2016లో విడుదలైన థాయ్ చిత్రం ‘వన్ డే’కు రీమేక్‌గా రూపొందుతోంది. అమీర్ ఖాన్, మన్సూర్ ఖాన్, అపర్ణ పురోహిత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సాయి పల్లవి భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’లో రణబీర్ కపూర్ సరసన సీతగా కనిపించబోతోంది. దీంతో బాలీవుడ్ లో సాయి పల్లవి జర్నీ గ్రాండ్‌గా మొదలైనట్లు కనిపిస్తోంది. సాయి పల్లవి లాంటి పవర్ హౌస్ పెర్ఫార్మర్ తో కలిసి జునైద్ ఖాన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 1వ తేదీన విడుదల కాబోతున్న ఈ క్లాసిక్ లవ్ స్టోరీ జునైద్ కెరీర్‌కు ఎలాంటి మలుపునిస్తుందో వేచి చూడాలి.