12th Fail Movie Review: ’12th ఫెయిల్’ మూవీ రివ్యూ.. కొలువుల వేటలో విద్యార్థుల కష్టాలు..

చదువు మీద ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన 12th ఫెయిల్ మాత్రం ఇంకో రకం. ఇండియాలో విద్యార్థులు గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారనే విషయాన్ని చూపించాడీయన. మరి ఈ 12th ఫెయిల్ ఎలా ఉంది..? టైటిల్‌లో ఫెయిల్ ఉన్నా.. సినిమాలో పాస్ అయ్యే లక్షణాలున్నాయా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

12th Fail Movie Review: 12th ఫెయిల్ మూవీ రివ్యూ.. కొలువుల వేటలో విద్యార్థుల కష్టాలు..
12th Fail Movie

Edited By:

Updated on: Nov 03, 2023 | 2:19 PM

మూవీ రివ్యూ: 12th ఫెయిల్

నటీనటులు: విక్రాంత్ మెస్సీ, మేధా శంకర్, ఆనంత్ వి జోషి, ఆయుష్మాన్ పుష్కర్ తదితరులు

సినిమాటోగ్రఫర్: రంగరాజన్ రామభద్రం

ఎడిటర్: జాస్కున్వర్ కోహ్లీ, విధు వినోద్ చోప్రా

సంగీతం: శాంతను మోయిత్రా

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: విధు వినోద్ చోప్రా

నిర్మాతలు: విధు వినోద్ చోప్రా, యోగేశ్ ఈశ్వర్

చదువు మీద ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన 12th ఫెయిల్ మాత్రం ఇంకో రకం. ఇండియాలో విద్యార్థులు గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారనే విషయాన్ని చూపించాడీయన. మరి ఈ 12th ఫెయిల్ ఎలా ఉంది..? టైటిల్‌లో ఫెయిల్ ఉన్నా.. సినిమాలో పాస్ అయ్యే లక్షణాలున్నాయా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

మనోజ్ కుమార్ శర్మ (విక్రాంత్ మెస్సీ) చంబల్‌లోని ఓ చిన్న గ్రామంలో ప్రతీసారి 12వ తరగతి ఫెయిల్ అవుతూ ఉంటాడు. మరోవైపు ఆయన తండ్రి (హరీష్ ఖన్నా) ప్రభుత్వ ఉద్యోగి అయినా.. సస్పెండ్ అవుతాడు. అన్యాయంగా తనను సస్పెండ్ చేసిన వారిపై ఫైట్ చేస్తుంటాడు. ఇక పేదరికం నుంచి వచ్చిన మనోజ్.. తన ఊరికి వచ్చిన డిఎస్పీ దుశ్యంత్ (ప్రియాన్షు ఛటర్జీ) ని చూసి ఎలాగైనా అలా అవ్వాలనుకుంటాడు. గ్వాలియర్‌కు కోచింగ్ కోసం బయల్దేరతాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో ప్రీతమ్ పాండే (అనంత్ వి జోషి)ను రైల్వే స్టేషన్‌లో కలిసి ఐపిఎస్ అవ్వడానికి డిల్లీ వెళ్తాడు. అక్కడేం జరిగింది..? మనోజ్ జీవితంలోకి శ్రద్ధా (మేధా శంకర్) ఎలా వచ్చింది..? అసలు మనోజ్ ఐపిఎస్ అయ్యాడా లేదా అనేది అసలు కథ..

కథనం:

ఎంతసేపూ కమర్షియల్ సినిమాలు చూసే మనకు.. అప్పుడప్పుడూ 12th ఫెయిల్ లాంటి అద్భుతమైన సినిమాలు తగులుతుంటాయి. చదువుకోండి ఫస్ట్.. చదువుకోండి అనేదే ఈ సినిమా లైన్. లైన్ కామెడీగా చెప్పినా కానీ సినిమాలో మాత్రం చాలా విషయం ఉంది.. ముఖ్యంగా IAS, IPS కోసం విద్యార్థులు తమ జీవితాల్ని ఎలా అంకితం చేస్తారు.. సివిల్స్ కోసం వాళ్లు పడే బాధలు, ఖర్చు చేసే సమయం.. వదులుకునే సరదాలు, వాళ్ల కలలు, ఆశలు.. ఇలా ఎన్నో 12th ఫెయిల్‌లో చూపించాడు దర్శకుడు విధు వినోద్ చోప్రా. IPS ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ రియల్ లైఫ్ నుంచి ఇన్‌స్పైర్ అయిన కథ ఇది. ఓ చిన్న గ్రామం నుంచి ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చి.. సివిల్స్‌కు ఎంపికై దేశానికి సేవ చేసిన ఓ IPS కథ ఇది. కాస్త సినిమాటిక్ టచ్ ఇచ్చినా.. కథనం మాత్రం ఆకట్టుకుంటుంది. చదువు గొప్పతనం అడుగడుగునా ఇందులో చూపించాడు విధు వినోద్ చోప్రా. ముఖ్యంగా సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే వాళ్ల కష్టాల్ని కళ్లకు కట్టేసాడు. ఒక్కో ఎగ్జామ్‌కు వాళ్లు పడే టెన్షన్.. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలు అంటూ అన్నీ అర్థమయ్యేలా చూపించాడు. విధు వినోద్ చోప్రా మంచి ప్రయత్నం చేసారు. ముఖ్యంగా ఢిల్లీ కోచింగ్ సెంటర్లలో వచ్చే సన్నివేశాలు రియలిస్టిక్‌గా ఉన్నాయి. పైగా UPSC కోచింగ్ ప్రొఫెసర్ వికాస్ దివ్యకృతి తానే కథ నచ్చి సొంతంగా ఈ సినిమాలో నటించాడు. ఆయన టీచ్ చేసిన సన్నివేశాలు చాలా న్యాచురల్‌గా వచ్చాయి.

నటీనటులు:

మనోజ్ కుమార్ పాత్రలో విక్రాంత్ మెస్సీ అద్భుతంగా నటించాడు. ఈ కారెక్టర్ కోసం బాగా మేకోవర్ అయ్యాడు విక్రాంత్. ఆయనకు సపోర్టుగా నిలిచే శ్రద్ధా పాత్రలో మేధా శంకర్ ఆకట్టుకుంది. కీలకమైన ఫ్రెండ్ పాత్రలో అనంత్ అద్భుతంగా నటించాడు. కథను మలుపు తిప్పే పాత్ర ఇది. మిగిలిన కారెక్టర్స్‌లో ఎవరికి వాళ్లు బాగా న్యాయం చేసారు..

టెక్నికల్ టీం:

శాంతను ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. పాటల కంటే బ్యాగ్రౌండ్ స్కోర్ వినసొంపుగా ఉంది. జాస్కున్వర్ కోహ్లీ, విధు వినోద్ చోప్రా జాయింట్‌గా ఎడిటింగ్ చేసారు. దర్శకుడే ఎడిటర్ కాబట్టి చాలా బాగా కట్ చేసారు. ఎక్స్ ట్రా సీన్స్ ఏవీ పెద్దగా కనిపించలేదు. రంగరాజన్ రామభద్రం సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రాణం. సినిమాలో పేదరికం ఉన్నా.. సినిమా మాత్రం ప్రతీ ఫ్రేమ్ చాలా రిచ్‌గా కనిపించింది. దర్శకుడిగానూ విధు వినోద్ చోప్రా ఆకట్టుకున్నారు. అద్భుతమైన కథను తీసుకుని.. దానికి ఏం కావాలో అన్నీ సమకూర్చారు. ముఖ్యంగా చదువు గొప్పతనం చెప్పిన సన్నివేశాలు బాగా కుదిరాయి.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా 12th ఫెయిల్.. చదువుపై అద్భుతమైన ప్రయత్నం..