
తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన సీనియర్ దర్శకుడు సారిక సత్య రవిచంద్ర (84) హైదరాబాదులో కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. రవిచంద్ర స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు. చిన్నతనం నుంచే సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. తొలినాళ్లలో దిగ్గజ దర్శకులు కమలాకర కామేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, అలాగే దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుల వద్ద సహాయ దర్శకుడిగా (అసోసియేట్ డైరెక్టర్) పనిచేసి దర్శకత్వ శాఖపై పూర్తి పట్టు సాధించారు.
రవిచంద్రలోని ప్రతిభను గుర్తించిన నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ, హిందీలో జితేంద్ర కథానాయకుడిగా తెరకెక్కిన ‘ఖైదీ’ చిత్రంతో ఆయనను దర్శకుడిగా పరిచయం చేశారు. ఆ తర్వాత తెలుగులో కృష్ణతో కలిసి ‘రౌడీ నంబర్ వన్’, ‘కిరాయిగూండా’, ‘సార్వభౌముడు’, ‘దొరగారికి దొంగపెళ్లాం’ వంటి సూపర్ హిట్ చిత్రాలను రూపొందించారు. కృష్ణతోనే కాకుండా ఆనాటి అగ్ర హీరోలతో రవిచంద్ర ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించారు. నందమూరి బాలకృష్ణతో ‘దేశోద్ధారకుడు’, ‘అశోక చక్రవర్తి’, విక్టరీ వెంకటేష్ తో ‘అగ్గిరాముడు’, ‘విజేత విక్రమ్’ వంటి చిత్రాలను తెరకెక్కించారు.
కేవలం తెలుగుకే పరిమితం కాకుండా ఇతర భాషల్లోనూ తన ముద్ర వేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘మహాగురు’ సహా మొత్తం 6 హిందీ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. వీటితో పాటు ఒక కన్నడ చిత్రానికి కూడా పనిచేసి బహుభాషా దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. రవిచంద్రకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు సారిక రామచంద్రరావు అందించిన వివరాల ప్రకారం రవిచంద్ర అంత్యక్రియలు హైదరాబాద్‌లోనే జరగనున్నాయి. రవిచంద్ర మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక అనుభవజ్ఞుడైన సీనియర్ దర్శకుడిని కోల్పోయిందని పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు.
ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..
ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..