AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: విలనిజానికి గ్లామర్ నేర్పిన నటుడు నాగభూషణం.. స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్..

రంగస్థలం నుంచి వెండితెరకు విస్తరించి, ప్రతినాయక పాత్రలకు కొత్త నిర్వచనం ఇచ్చిన నటుడు నాగభూషణం. విలన్ డైలాగులకు ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించిన ఘనత ఆయనది. ‘రక్తకన్నీరు’ నాటకంతో వేల ప్రదర్శనలిచ్చి, సినీ రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్న బహుముఖ నటుడాయన. తెలుగు చిత్రసీమలో ప్రతినాయక పాత్రలంటే కేవలం క్రూరత్వం మాత్రమే కాదు, అందులో హాస్యం, సెటైర్ కూడా పండించవచ్చని నిరూపించిన మహానటుడు నాగభూషణం.

Tollywood: విలనిజానికి గ్లామర్ నేర్పిన నటుడు నాగభూషణం.. స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్..
Nagabushanam
Rajitha Chanti
|

Updated on: Jun 22, 2026 | 9:02 PM

Share

తెలుగు సినీ, నాటకరంగ చరిత్రలో నాగభూషణం పేరు ఓ ప్రత్యేక అధ్యాయం. ప్రతినాయకుడి పాత్రను హాస్యం, సెటైర్‌తో రంగరించి, హీరోలకు దీటుగా ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించిన ఘనత ఆయనకే చెల్లింది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, రంగస్థల నటుడిగా, సినీ తారగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసిన ఆయన ప్రస్థానం స్ఫూర్తిదాయకం. 1921 ఏప్రిల్ 19న నెల్లూరు జిల్లా కొండేపి సమీపంలోని అనకర్లపూడి గ్రామంలో చుండి నాగభూషణం జన్మించారు. రాఘవరావు, సీతమ్మ దంపతులకు రెండవ కుమారుడిగా పుట్టిన ఆయనది కలిగిన కుటుంబం కాదు. రెండేళ్ల వయసులో మేనమామ ఊరైన అపమాంచాపురం వెళ్లారు. అక్కడ ఆయన తండ్రి వీధి బడి పెట్టారు. హైస్కూల్ ఖర్చులకు ఇబ్బంది పడి, చిన్నా చితకా పనులు చేస్తూ చదువు కొనసాగించారు. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత పైచదువులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డొచ్చాయి. 1942లో తండ్రి మరణించిన రోజునే రైల్వే శాఖ ఉద్యోగానికి మద్రాస్ నుంచి కాల్ లెటర్ రావడంతో, తండ్రి కర్మదినాన్ని వదిలి ఇంటర్వ్యూకు హాజరయ్యారు. రైల్వే ఉద్యోగంలో తోటి ఉద్యోగులు వేసే నాటకాలు చూసి, నాగభూషణానికి నటనపై ఆసక్తి కలిగింది. నాటకరంగంలో కృషి చేయాలనే లక్ష్యంతో విజయవాడకు బదిలీ చేయించుకున్నారు. అక్కడ హనుమంతరాయ గ్రంథాలయంతో పరిచయం ఏర్పడి, వామపక్ష భావజాలం, నాటకరంగ ప్రముఖులతో అనుబంధం పెంచుకున్నారు. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, జి. వరలక్ష్మితో పరిచయం వల్ల ఆత్రేయ రాసిన ‘భయం’, ‘కప్పలు’ వంటి నాటకాల్లో నటించారు. రచయిత పాలగుమ్మి పద్మరాజును తన గురువుగా భావించారు.

1951లో వచ్చిన ‘పల్లెటూరు’ చిత్రంతో నాగభూషణం సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ‘పెంకి పెళ్ళాం’లో తాగుబోతుగా, ‘అమర సందేశం’లో విలన్‌గా పలు చిత్రాల్లో నటించారు. 1956లో బాల్య స్నేహితుడు ఘంటసాల కృష్ణమూర్తి నిర్మించిన ‘ఏది నిజం’ చిత్రంలో హీరోగా నటించారు. ఈ చిత్రం విజయవంతం కావడమే కాకుండా రాష్ట్రపతి బహుమతి కూడా పొందింది. అయితే హీరోగా ఆయనకు ఆశించిన గుర్తింపు రాలేదు. ‘మాయాబజార్’ వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు చేస్తూనే నాటక ప్రదర్శనలతో బిజీగా గడిపారు. 1961లో ‘శభాష్ రాజా’ చిత్రంతో ఆయన దశ తిరిగింది. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తీసిన ‘మంచి మనసులు’ చిత్రంలో ఎం.ఆర్. రాధా పోషించిన పాత్రను ఆయనకు ఇచ్చారు. ‘మెడలో తాళి కట్టగానే ఒళ్లో వచ్చి పడిందే సిగ్గు! అందుకే ఈ ఫ్యామిలీ గర్ల్స్ సంసారానికి తప్ప సరసానికి పనికిరారన్నారు’ వంటి డైలాగులతో ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత వచ్చిన ‘మూగమనసులు’ పరిశ్రమలో ఆయనకు ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. ‘ఉమ్మడి కుటుంబం’ (1967)తో ఆయన మరింత బిజీ అయ్యారు.

నాగభూషణం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది ‘రక్తకన్నీరు’ నాటకం. తమిళంలో ఎం.ఆర్. రాధా సంచలనం సృష్టించిన ‘రక్త కన్నీర్’ స్ఫూర్తితో, తన గురువు పాలగుమ్మి పద్మరాజు చేత తెలుగులో మార్పులు చేయించి, రవి ఆర్ట్ థియేటర్స్ సంస్థను స్థాపించి, 1956 మే నెలలో తొలి ప్రదర్శన ఇచ్చారు. మొత్తం 5432 ప్రదర్శనలిచ్చిన ఈ నాటకంలో ఆయన సరసన నటించిన వాణిశ్రీ, శారద, రేవతి వంటి అనేక మంది నటీమణులు సినీ రంగంలోకి ప్రవేశించారు. తొలి నుంచి చివరి వరకు ఉన్న సీతను నాగభూషణం వివాహం చేసుకున్నారు. నాటకాల్లో నటిస్తున్నందుకు పారితోషికం తీసుకోకుండా, వసూలైన మొత్తాన్ని బృంద సభ్యులకు పంచి, 30 కుటుంబాలకు ఆసరాగా నిలిచారు. ఎన్టీఆర్‌తో సన్నిహితంగా మెలిగిన నాగభూషణం, ఆయన ప్రోత్సాహంతో ‘ఒకే కుటుంబం’ చిత్రాన్ని నిర్మించారు. ‘కథానాయకుడు’ చిత్రంలో ఆయన విలన్ డైలాగులకు ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం అప్పటి నుంచే ప్రారంభమైంది. తర్వాత హీరో కృష్ణకు సన్నిహితుడిగా మెలిగి, ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘నేనంటే నేనే’ చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. ‘నాటకాల రాయుడు’, ‘మహమ్మద్ బిన్ తుగ్లక్’ చిత్రాల్లో హీరోగా నటించారు. అయితే ఆయన నిర్మించిన ‘ప్రజానాయకుడు’, ‘భాగస్తులు’ వంటి చిత్రాలు అంతగా విజయం సాధించలేదు. 1974లో ‘ముత్యాల ముగ్గు’తో రావు గోపాలరావు వంటి కొత్త విలన్‌ రాకతో నాగభూషణం నటన మొనాటనీకి చేరిందనే వాదన ఉంది, ఇది ఆయన కెరీర్‌పై ప్రభావం చూపింది.

వ్యక్తిగత జీవితంలో, 1941లో సుబ్బరత్నంతో ఆయన వివాహం జరిగింది. ఆమె అకాల మరణం తర్వాత శశిరేఖను వివాహం చేసుకున్నారు, వారికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. 1956లో సహనటి సీతను మూడో వివాహం చేసుకున్నారు, వీరికి ఇద్దరు పిల్లలు. కూతురు భువనేశ్వరిని ఛాయాగ్రాహకుడు మీర్‌కు ఇచ్చి మతాంతర వివాహం చేశారు. 1994లో ‘నెంబర్ వన్’ ఆయన చివరి చిత్రం. 1995 మే 5న నాగభూషణం తుది శ్వాస విడిచారు. ఆయన ఇంటిపేరు కొద్దిమందికే తెలిసినా, ప్రేక్షక హృదయాల్లో ఆయన ఎప్పటికీ ‘రక్తకన్నీరు నాగభూషణం’గానే నిలిచిపోయారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్..

Follow Us