
నటుడు ధూళిపాళ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు వెంటనే గుర్తుకు వచ్చే పాత్ర శకుని. ఎన్నో విభిన్న పాత్రలు పోషించి ధూళిపాళ మెప్పించినా, శకుని మామగా ఆయన అందరి మదిలో శాశ్వతంగా గుర్తుండిపోయారు. ముల్లుని ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోటే కోయాలి అనే డైలాగులు చెబుతూ, పాచికల్ని రాపాడి, క్రూరమైన నవ్వుతో కనిపించిన దాన వీర శూర కర్ణ చిత్రంలోని శకుని పాత్ర తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయి. అయితే, ధూళిపాళను శకుని పాత్రలో తొలిసారిగా పరిచయం చేసింది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో ఆయనకు ఆ పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు ఎన్టీఆర్. మాయాబజార్‌లో సి.ఎస్.ఆర్, పాండవ వనవాసంలో లింగమూర్తి వంటి వారు పోషించి మెప్పించిన శకుని పాత్రను తనదైన శైలిలో, తనకి మాత్రమే సొంతమైన హావభావ నటనా వైదుష్యంతో నటించి, ఆ పాత్రకు ధూళిపాళ జీవం పోశారు. ధూళిపాళ అంటేనే శకుని అనేంతలా ఆయనని తప్ప మరో నటుడిని ఆ పాత్రలో ఊహించుకోలేని విధంగా నటించి, మెప్పించి, ఒప్పించి అందరి హృదిలో చిరస్థాయిగా శకుని ధూళిపాళగా మిగిలిపోయారు. దాన వీర శూర కర్ణ చిత్రంలో దుర్యోధనుడిగా ఎన్టీఆర్ డైలాగులు ఎంత పాపులర్ అయ్యాయో, శకునిగా నటించిన ధూళిపాళ డైలాగులు అంతగా ఆకట్టుకున్నాయి. ఎంత క్లిష్టమైన పద సమాసమైనా, పెద్ద పెద్ద డైలాగులైనా ఇదెంతలే అన్నంత సులువుగా చెప్పి, దానికి సరిపోయే భావాన్ని పలికించిన ఉద్దండ నటుడు ధూళిపాళ.
శ్రీకృష్ణ పాండవీయం చిత్రం ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మితమైంది. దర్శకుడిగా ఆయన పేరు తెరపై కనిపించింది ఈ చిత్రంతోనే. కురు సార్వభౌముడు దుర్యోధనుని పాత్రను ఆయన తొలిసారిగా ఈ సినిమాలో పోషించారు. ఈ సినిమాలో దుర్యోధనుడి పాత్రలో నటించిన ఎన్టీఆర్ కి ఎంత పేరు వచ్చిందో, శకునిగా నటించిన ధూళిపాళకు అంత పేరు వచ్చింది. పాచికలతో మాయ చేసే శకునిమామ కథను, కౌరవులపై అతనికి ఉన్న పగను శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలో చూపించినంతగా మరే ఇతర పౌరాణిక సినిమాలోనూ చూపించలేదు. శకుని పాత్ర ధూళిపాళకు దక్కడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. రంగస్థలం మీద అనేకసార్లు దుర్యోధనుడి పాత్ర పోషించిన ధూళిపాళకు తొలి చిత్రం భీష్మలో దుర్యోధనుడి పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్ర నిర్మాణ సమయానికి ఎన్టీఆర్ మంచి యవ్వనంలో ఉన్నా, భీష్మ చిత్రం కోసం కురు వృద్ధుడిలా మారిపోయి ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ధూళిపాళ నటించిన రెండవ చిత్రం కలిమిలేములు. ఏఎన్నార్ రికమెండేషన్ తో ఆయనకు ఆ పాత్ర దక్కింది. ఆ తర్వాత శ్రీకృష్ణార్జున యుద్ధంలో గయుడుగా నటించే ఛాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ కు ఒక అలవాటు ఉండేది. తను దర్శకత్వం వహించే చిత్రాలలోని ముఖ్య పాత్రలకు భిన్న భిన్న రీతుల్లో డైలాగ్స్ రాయించేవారు. ఆ డైలాగ్స్ అన్నీ ఆయనకు కంఠస్థం. సముద్రాల శకుని పాత్ర కోసం రాసిన డైలాగ్స్ ఆయనకు చాలా చాలా ఇష్టం. “మా సినిమాలో శకుని పాత్రను పెంచాం. అతని జీవిత ఘట్టాలను మా చిత్రంలో పొదిగాం. ఆ పాత్రను ఎవరు ధరిస్తారో వారు అదృష్టవంతులు” అని అందరినీ ఊరిస్తుండేవారు ఎన్టీఆర్. ధూళిపాళ కూడా ఆయన చెప్పే మాటలు వినేవారు. అంత మంచి పాత్రను పోషించే అవకాశం తనకు వస్తే బాగుంటుందని మనసులో అనిపించినా, పరిశ్రమలో చాలామంది సీనియర్స్ ఉన్నారని, కేవలం మూడు చిత్రాల్లోనే నటించిన తనకు ఛాన్స్ రాదని సరిచెప్పుకునేవారు. ఒకరోజు ఉదయం ఎన్టీఆర్ సొంత సంస్థ నుంచి ధూళిపాళకు కబురు వచ్చింది, కారు వచ్చింది. ఎన్టీఆర్ గారు మిమ్మల్ని అర్జెంట్ గా తీసుకురమ్మన్నారని చెప్పారు. ఆ రోజు కూడా మేకప్ తో రెడీ అయి ఆఫీస్ గదిలో కూర్చుని ఏదో రాసుకుంటున్న ఎన్టీఆర్, ధూళిపాళను చూడగానే “రండి బ్రదర్, మీ కోసం ఎదురు చూస్తున్నా. మన సినిమాలో శకుని వేషం మీదే. తెలుగు తమిళ భాషల్లో మీరే చేస్తున్నారు” అని రెండు ఫైల్స్ చేతికిచ్చారు. అపరిమితమైన ఆశ్చర్యం, ఆనందం, భయం ఒక్కసారే కలిగాయి. సీనియర్ నటులు ఉన్నా, వారందరినీ కాదని ధూళిపాళ ప్రతిభను గమనించి ఆ వేషం ఆయనకి ఇవ్వడం ఎన్టీఆర్ గొప్పతనం. ఇండస్ట్రీలో అందరికీ ఆశలు పెంచిన శకుని పాత్ర ధూళిపాళకు అలా దక్కింది.
ధూళిపాళ శరీరాన్ని కొంచెం బెండ్ చేసి, తలను ఒక పక్కకు వంచి, కుడిచేత్తో కర్ర పట్టుకుని వంకర చూపులతో డైలాగులు చెబుతుంటే, ఎన్టీఆర్ నవ్వుతూ “ఓకే బ్రదర్, అందుకే ఈ పాత్ర మీకు ఇచ్చాం” అన్నారు. శ్రీకృష్ణ పాండవీయం విడుదల తర్వాత నటి జి.వరలక్ష్మి సినిమా చూసి, “అబ్బా తినేశావయ్యా, పాత్రలో జీవించావ్” అని అభినందించారు. ఆ తర్వాత బాలభారతం, దానవీరశూరకర్ణ చిత్రాల్లోనూ ధూళిపాళ శకుని పాత్ర పోషించి, ఆ పాత్రకు పర్యాయపదంగా నిలిచిపోయారు.