సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన ‘దర్బార్’ సినిమా మొదలైన దగ్గర్నుంచీ.. ఈ చిత్ర యూనిట్‌కి, రజనీకి అన్నీ సమస్యలే ఎదురవుతున్నాయి. ఏదో ఒక రూపంలో దర్బార్ సినిమా గురించిన వార్తలు ట్రోల్ అవుతూనే ఉన్నాయి. ఎంతో ఆర్భాటంగా రిలీజ్ అయిన దర్భార్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఆశించినంత విజయాన్ని అందుకోలేక పోయింది. దీంతో.. ఇటీవలే ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్స్ కూడా రజనీ ఇంటి ముందు నిరసన కూడా చేశారు.
అయితే ఇప్పుడు ఈ ప్రభావం రజనీ కాంత్ రెమ్యునరేషన్‌పై పడిందట. ప్రస్తుతం సూపర్ స్టార్ హీరోగా తెరకెక్కుతోన్న ‘తలైవార్ 168’ చిత్ర బృందం రజనీ పారితోషికంపై కోత పెట్టిందనే వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతోన్నాయి. ‘తలైవార్ 168’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకి శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఖుష్బూ, మీనా హీరోయిన్లుగా నటిస్తుండగా, కీర్తి సురేష్ రజనీ కూతురిగా కనిపించనుంది. సన్ పిక్చర్స్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది.