హిందీ బిగ్ బాస్ సీజన్ 13 ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది నటి షెహనాజ్ గిల్. ఈ షోలో దివంగత నటుడు సిద్ధార్థ్ శుక్లాతో షెహనాజ్ స్నేహం ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. వీరిద్దరికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియోలో ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి. సిద్ధార్థ్ అకాల మరణం తర్వాత కొద్ది నెలలు అజ్ఞాతంలో ఉన్న షెహనాజ్.. ఇటీవలే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఫిలిం ఫేర్ సౌత్ అవార్డ్స్ వేడుకలలోనూ ఆమె సందడి చేసింది. ఇదిలా ఉంటే.. షెహనాజ్ తండ్రి సంతోక్ సింగ్ సుఖ్‌కు బెదిరింపులు వచ్చాయి. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆయనకు ఫోన్ చేసి దీపావళి లోగా చంపేస్తామని బెదిరించారట. దీంతో శనివారం అమృత్ సర్‌లోని ఎస్ఎస్పీ స్వపన్ శర్మకు సంతోక్ ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ తనకు వచ్చాయని.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని సంతోక్ ఆరోపించారు.
వివారాల్లోకెలితే.. షెహనాజ్ తండ్రి సంతోక్ సింగ్ తాజాగా బియాస్ నుంచి టరంటాన్ వెళ్తున్నాడు. మార్గ మధ్యలో అతడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫారెన్ నంబర్ నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేయగానే.. దీపావళి ముందే తనను చంపుతామని కొందరు యువకులు బెదిరించారని.. నేరుగా ఇంట్లోకి వచ్చి మరీ చంపేస్తామని బెదిరించినట్లు సంతోక్ తెలిపారు. వెంటనే అమృత్ సర్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేను హిందూ నాయకుడిని కాబట్టి నన్ను టార్గెట్ చేస్తున్నారని సంతోక్ ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలోనూ తనకు ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయని.. ఈవిషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
ఇక ఇప్పుడు తనను బెదిరించిన వారిని అరెస్ట్ చేయకపోతే.. తన కుటుంబంతో కలిసి పంజాబ్ వదిలేసి వెళ్లిపోతాను అని ఆవేదన వ్యక్తం చేశారు సంతోక్. ఆయనకు ఇలాంటి బెదిరింపులు ఇది మొదటి సారి కాదు. 2021లో భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత ఇద్దరు వ్యక్తులు అతడిపై దాడి చేశారు.